YSR పుట్టిన రోజు : ఇళ్ల స్థలం వద్దే పట్టాలు – సీఎం జగన్

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 12:15 AM IST
YSR పుట్టిన రోజు : ఇళ్ల స్థలం వద్దే పట్టాలు – సీఎం జగన్

పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులతో పేదల ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై సీఎం జగన్‌ 2020, జూన్ 02వ తేదీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న 3లక్షల 38వేల 144 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి 1,323 కోట్లు పాత బకాయిలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చెల్లింపులు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు అవసరమైన నిధులను సమీకరించి వీలైనంత త్వరగా ఓ తేదీని ప్రకటించాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. 

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణాలపైనా సీఎం జగన్‌ సమీక్షించారు. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. డిజైన్‌లో భాగంగా బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులకు చెప్పారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు సీఎం జగన్.

పేదవాడిపై ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా ఇంటిని సమకూర్చాలని అధికారులతో సీఎం జగన్‌ అన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలన్నారు. గవర్నమెంటు అంటే నాసిరకం అనే పేరుపోవాలని… గవర్నమెంటు చేస్తే నాణ్యతతో పనిచేస్తుందన్న పేరు రావాలని సీఎం ఆకాంక్షించారు. పేదలకోసం చేస్తున్న ఈ కార్యక్రమంలో చిత్తశుద్ధితో పనిచేసి పుణ్యం దక్కించుకోవాలని అధికారులకు చెప్పారు జగన్‌. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 

YSR పుట్టినరోజు సందర్భంగా జులై 8న పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఏపీ సీఎం. భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని అధికారులుకు సూచించారు. వారి కేటాయించిన స్థలం వద్దే  రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.