Magunta Srinivasulu Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు- వైసీపీ ఎంపీ క్లారిటీ

తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.

Magunta Srinivasulu Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు- వైసీపీ ఎంపీ క్లారిటీ

Magunta Srinivasulu Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.

”ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మా కుటుంబానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదు. దేశంలో లిక్కర్ కు సంబంధించి రెడ్డి అనే పేరు వస్తే… మాగుంట శ్రీనివాసులు రెడ్డే అంటారు. అది మంచో, చెడో నాకు తెలియదు. గత 70 ఏళ్లుగా మా కుటుంబం లిక్కర్ బిజినెస్ లో ఉంది. అందుకే అందరూ నా గురించి అనుకుంటారు. మా తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం. కుట్రపూరితంగా మాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను, నా కుమారుడు ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌లో డైరెక్టర్లుగా లేము. వ్యాపారం చేసే మా బంధువులకు మాగుంట అనే పేరు ఉండటం వల్లే మాపై ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో 32 జోన్లు ఉంటే మా బంధువులు 2 జోన్లలో వ్యాపారం చేశారు. మా ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేసిన ఈడీకి అనుమానాలు నివృత్తి చేశాము” అని ఎంపీ మాగుంట చెప్పారు.

”మాగుంట ఆగ్రో ఫామ్ పేరు రావడంతో అందరూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటున్నారు. అయితే అది మా బంధువులది. మా వ్యాపారానికి సాయం చేయమని నేను ఏ సీఎంని కూడా అడగలేదు. నా వ్యాపారాలకు నా ఎంపీ హోదాను ఎక్కడా వాడుకోలేదు” అని ఎంపీ మాగుంట స్పష్టం చేశారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లో వచ్చినట్టుగా ఎంపీ మాగుంట స్పష్టం చేశారు. తాను ఏ వ్యాపారాల్లోనూ భాగస్వామిని కాదన్నారు. తన వ్యక్తిత్వంపై కావాలనే దాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ బంధువులు చేసే వ్యాపారాలు తమకు ఇబ్బంది కలిగించాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణల వల్ల తన రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న ఎంపీ మాగుంట.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. శుక్రవారం రోజున ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 40కి పైగా చోట్ల దాడులు నిర్వహించారు. ఎంపీ మాగుంటకు చెందిన ఇళ్లు, ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు జరిపింది.