ఏపీ శాసనసభ సమరం : టీడీపీపై ఎదురుదాడికి సర్కార్‌ వ్యూహం

  • Published By: sreehari ,Published On : November 30, 2020 / 07:01 AM IST
ఏపీ శాసనసభ సమరం : టీడీపీపై ఎదురుదాడికి సర్కార్‌ వ్యూహం

AP Assembly Winter Sessions : ఏపీలో నేటి నుంచి శాసనసభా సమరం ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు శాసనసభ మొదలుకానుంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోద ముద్ర వేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా… ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతిపక్షం రెడీ అయ్యింది.




ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంటే.. ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలన్న దానిపై ఎత్తులు వేస్తోంది. టీడీపీపై ఎదురుదాడికి దిగేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మొత్తం 20 అంశాల పై చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది.

వీటిలో పోలవరం పనుల పురోగతితో పాటు.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతిపై చర్చించే అవకాశముంది. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు.. టిడ్కో ఇల్లు ఒక్క రూపాయికి ఇవ్వడం, 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ అంశాన్ని హైలెట్ చేయబోతోంది ప్రభుత్వం.
https://10tv.in/ap-assembly-sessions-to-be-started-from-today/
వీటితో పాటు కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు.. 130 బిసి కులాలకు 56 కార్పొరేషన్ లు నియామకంలాంటి అంశాలపై చర్చ చేపట్టనుంది. వరదలు, తుఫానుల సమయంలో ప్రభుత్వం అందించిన సహాయాన్ని కూడా సభలో స్పష్టంగా తెలుపాలని సీఎం జగన్‌ మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించారు.

హిందూ విగ్రహాలపై సంఘవిద్రోహ శక్తులు చేసిన దాడులు, ముస్లిం మైనారిటీల ఆత్మహత్యలు, దళితులపై జరిగిన దాడులను టీడీపీ హైలేట్‌ చేసే అవకాశం ఉంది. వీటిపై పూర్తి సమాచారంతో సభకు హాజరుకావాలని జగన్‌ ఎమ్మెల్యేలను ఆదేశించారు.




టీడీపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టే బాధ్యతను బ్రాహ్మణ, ముస్లిం మైనారిటీ, దళిత సభ్యులకు సిఎం జగన్ అప్పగించారు. ప్రతిపక్షం విమర్శలను సమర్ధవంతంగా తిప్పికొట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

శాసనమండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండటంతో అక్కడ కూడా ప్రతి ఒక్క ప్రశ్నకు ధీటుగా సమాధానం ఇవ్వాలని పార్టీ నేతలను ఆదేశించారు. చంద్ర బాబుకు దమ్ముంటే ఐదు రోజుల పాటు పూర్తిగా చర్చలో పాల్గొనాలన్నారు ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి.. ఏ అంశంపైన అయినా తాము చర్చకు సిద్ధమన్నారు.




వ్యూహ ప్రతివ్యూహాలతో అధికార, విపక్షా పార్టీలు అసెంబ్లీ సమావేశాలకు సమాయత్తమయ్యాయి. దీంతో ఇవాళ్టి నుంచి ఐదు రోజులపాటు సమావేశాలు వాడీవేడీగా జరిగడం ఖాయంగా కనిపిస్తోంది.