షోకాజ్ నోటీసులు అందుకుని రెచ్చిపోతున్న రఘురామ; వైసీపీ లీడర్ల సెటైర్లు

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీసీ బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆ షోకాజ్‌ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తర

షోకాజ్ నోటీసులు అందుకుని రెచ్చిపోతున్న రఘురామ; వైసీపీ లీడర్ల సెటైర్లు

Raghu Rama

పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీసీ బుధవారం షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఆ షోకాజ్‌ నోటీసుకు రఘురామ కృష్ణంరాజు సమాధానమిచ్చారు. పార్టీ తరపున షోకాజ్‌ నోటీస్‌ పంపిన విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చిన  షోకాజ్‌కు చట్టబద్ధత లేదన్నారు. రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని నిలదీశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ సంఘం ఉందా…ఉంటే ఆ క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు.  క్రమశిక్షణ సంఘానికి ఛైర్మన్, సభ్యులెవరో తెలపాలని… మీటింగ్‌ ఎప్పుడు పెట్టారో చెప్పాలన్నారు. షోకాజ్ ఎవరు జారీ చెయ్యాలో… అసలు షోకాజ్‌ ప్రొసీజర్ తెలుసా? అని విజయసాయిరెడ్డిని రఘురామ కృష్ణంరాజు సూటిగా నిలదీశారు. మనది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కాదని…  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.

పార్టీ పేరులో ఉన్న వైఎస్సార్ అనే పదాన్ని తన లెటర్ హెడ్స్‌లో విజయసాయి రెడ్డి ఉపయోగించడం పార్టీ అధినేత జగన్‌కు తెలుసా అని రఘురామకృష్ణం రాజు నిలదీశారు. ఎన్నికల నియమావళికి భిన్నమైన రీతిలో షోకాజ్ వచ్చిందంటూ… ఇది అందరినీ తప్పుదారి పట్టించడమేనన్నారు. ఇందుకు చట్టరీత్యా ప్రతిస్పందించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ అంశాలకు సంబంధించి భారత ఎన్నికల సంఘం రూపొందించిన 1968 నాటి ఎన్నికల చిహ్నాల రిజర్వేషన్, కేటాయింపు ఆర్డర్, భారత రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్,  ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని  29-ఎ సెక్షన్, ఎన్నికల నియమావళిలోని 5, 10 నిబంధనలను పార్టీ దృష్టికి ఈ సందర్భంగా తీసుకువచ్చారు.

షోకాజ్ నోటీసుకు తానిచ్చిన జవాబు ప్రతులను కడప కేంద్రంగా ఉన్న… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి, ఢిల్లీలోని ఎన్నికల కమిషన్‌కు కూడా రఘురామకృష్ణం రాజు పంపారు. అంతేకాదు…  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2015లో భారత ఎన్నికల సంఘం పంపిన లేఖ ప్రతి, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నుంచి జారీ ఆయిన సర్టిఫికెట్ ఆఫ్ ఎలక్షన్ ప్రతి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన బి-ఫారం ప్రతిని కూడా తన జవాబుకు జతపరిచారు.

పేర్ని నాని సెటైర్లు: రఘురామకృష్ణంరాజు సమాధానంపై మంత్రి పేర్ని నాని స్పందించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అంటే తెలియని వాళ్లు తమ పార్టీలో ఉండటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.  గోదావరి వాళ్లకు వెటకారం ఎక్కువంటూ సెటైర్‌ వేశారు.

మొత్తానికి రఘురామ కృష్ణంరాజు సమాధానంతో షోకాజ్‌ నోటీసు ఎపిసోడ్‌కు ఎండ్‌ కార్డ్‌ పడుతుందని  పార్టీ నేతలు భావిస్తే… అది మరింత వివాదంగా మారింది. తనకు వచ్చిన నోటీస్‌ పార్టీ నుంచి వచ్చింది కాదంటూ రఘురామ కృష్ణంరాజు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు.  దీంతో వివాదం మరింత ముదిరింది. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read: ఎన్నికల కమిషన్ తో వైసీపీ ఎంపీ రఘురాం భేటీ..