కుప్పంలో కంప్లైంట్ : బాబు మిస్సింగ్.. వెతికిపెట్టండి ప్లీజ్!

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 01:39 PM IST
కుప్పంలో కంప్లైంట్ : బాబు మిస్సింగ్.. వెతికిపెట్టండి ప్లీజ్!

చంద్రబాబు కనిపించడం లేదంట.. ఇదీ కుప్పం నుంచి వచ్చిన కంప్లైంట్‌.. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కనిపించడం లేదని, ఆయనను వెతికిపెట్టండంటున్నారు వైఎస్సార్‌సీపీ నేతలు. కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ కేడర్.. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తమ ఎమ్మెల్యే చంద్రబాబు ఎక్కడ ఉన్నారో.. జాడ కనిపెట్టాలని వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకూ కుప్పం నియోజకవర్గానికి రాలేదంటున్నారు. అమరావతి రైతుల బాటలోనే కుప్పం వైఎస్సార్‌సీపీ నేతలు వెళుతున్నారు. రెండు రోజులుగా రైతులు మంగళగిరి, తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అమరావతిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ కంప్లయింట్‌ చేయడంతో దాని నుంచి దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలు ఈ ఎత్తుగడ వేశారంటున్నారు. కుప్పంలో చంద్రబాబు ఇప్పుడు కాదు.. ఎప్పుడూ ఉండరనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు రచ్చ చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో కూడా ఈ పోటాపోటీ పంచాయితీలు, ఫిర్యాదులు, శిబిరాల నిర్వహణ లాంటివి జరిగాయని గుర్తు చేస్తున్నారు.

పోలీసులకు వైసీపీ వినతి పత్రం :
అమరావతిలో పర్యటించిన చంద్రబాబు.. రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ తాజా పరిణామాలకు కౌంటర్‌గా వైఎస్సార్‌‌సీపీ కూడా సేమ్ టు సేమ్ ఇలాగే.. తమ ఎమ్మెల్యే చంద్రబాబు జాడ కనిపెట్టాలని కుప్పం పోలీసులకు వినతి పత్రం అందించడం చర్చనీయాంశం అయ్యింది. గతంలో చల్లో ఆత్మకూరు విషయంలోనూ రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. గ్రామంలో ఒకరిపై ఒకరు పోటీగా శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు.

అలానే డీజీపీకి ఫిర్యాదులు విషయంలో కూడా రెండు పార్టీలు పోటీ పడ్డాయి. తమ వారి మీద దాడులు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నిర్ణయించుకుంది. అంతకు ముందే వైసీపీ నేతలు డీజీపీని కలిసి టీడీపీ నేతలు తమ పార్టీ వారిపై దాడులు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.

రాజధానిలో ఇప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో అక్కడ నుంచి దృష్టిని మరల్చేందుకు వైసీపీ నేతలు కొత్త డ్రామాలకు తెరతీశారని టీడీపీ వర్గాలతో పాటు అమరావతి ప్రాంత రైతులు అంటున్నారు. ఇదంతా మీరు నేర్పించిందేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద ఈ పోటాపోటీ రాజకీయాలు చూసిన జనాలు మాత్రం ఇదేం గోలరా బాబూ అని ముక్కున వేలేసుకుంటున్నారు.