అధికారంలోకి వచ్చినా ఏం లాభం, తీవ్ర నిరాశలో వైసీపీ నేతలు

  • Published By: naveen ,Published On : October 20, 2020 / 05:21 PM IST
అధికారంలోకి వచ్చినా ఏం లాభం, తీవ్ర నిరాశలో వైసీపీ నేతలు

ysrcp leaders unhappy: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. కొన్ని కార్పొరేషన్లకు తప్ప ఇంకా ప్రభుత్వ నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు. వీటి సంగతి అటుంచితే కనీసం లోకల్ పదవులతోనైనా సర్దుకుందాం అనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో అవి కూడా ముందుకు సాగడం లేదు. దీంతో పదవులు లేకుండా ఇంకెన్నాళ్లు ఇలా ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. పార్టీలో రాష్ట్ర స్థాయి నేతల నుంచి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నేతల వరకూ అందరూ పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ, అవి కులాలకు సంబంధించినవి కావడంతో.. మిగిలిన చాలామంది నేతలు పదవుల కోసం వేచి చూస్తున్నారు.

పెండింగ్ లో నామినేటెడ్ పోస్టుల భర్తీ:
ప్రభుత్వంలో చాలా వరకూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వాటికోసం చాలా రోజులుగా పార్టీ కీలక నేతల చుట్టూ తిరుగుతున్నారు ఆశావహులు. పార్టీ కోసం అనేక ఏళ్లు కష్టపడ్డాం.. తీరా అధికారం వచ్చిన తర్వాత అయినా అవకాశం ఉన్న పదవులను భర్తీ చేయకపోతే ఎలా అంటూ వారంతా లోలోపల మధనపడిపోతున్నారు. లోకల్ పదవుల కోసం ఎదురు చూసిన వారికి కూడా నిరాశే ఎదురవుతోంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతకీ జరగకపోతుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు అంతా నిరుత్సాహంగా ఉన్నారట.

పదవుల కోసం కంగారు:
పక్క రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ ఎన్నికలు ఎప్పుడు అంటూ పార్టీ కీలక నేతల్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో కొంత మంది పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. జిల్లా పరిషత్ బరిలో ఉన్నవారు తమకు పదవులు ఎప్పుడు అంటూ తెగ కంగారుపడుతున్నారని అంటున్నారు. ఏదేమైనా తమకు మాత్రం పదవులు కావాల్సిందే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఎన్నికలు జరిగిన తర్వాత నామినేటెడ్ పదవులు అంటూ చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు చేపట్టలేదని చెబుతున్నారు. ఇక లోకల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తుందో తెలియక బాగా ఫీలైపోతున్నారు వైసీపీ నేతలు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిందే.