వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం, ఆందోళనలో సీఎం జగన్

  • Published By: naveen ,Published On : September 6, 2020 / 03:45 PM IST
వైసీపీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం, ఆందోళనలో సీఎం జగన్

కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్ 6,2020) బెంగళూరు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా బారిన పడిన ఎమ్మెల్యే దొరబాబు కొంతకాలంగా కాకినాడలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంతలోనే సీరియస్ కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు.

కరోనా బారిన పడ్డ 30మందికిపైగా ఎమ్మెల్యేలు:
ఏపీలో కరోనా వైరస్ వణికిస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో వేల సంఖ్యలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. కరోనా వైరస్ ప్రజలకు ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తోంది. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అంతా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ఏపీలో 30మందికిపైగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎంలు కోవిడ్ కు గురయ్యారు. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, అరకు ఎమ్మెల్యే ఫాల్గుణ, మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా సోకింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కరోనా సోకింది. ఆయన కరోనా నుండి కోలుకొన్నారు. మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా సోకింది. ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్ష:
కాగా, ఎమ్మెల్యే పెండెం దొరబాబును సీఎం జగన్ శనివారం(సెప్టెంబర్ 5,2020) ఫోన్‌లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. దొరబాబు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

ఏపీలో వరుసగా 10రోజూ 10వేలకు పైగా కేసులు:
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69వేల 623 శాంపిల్స్‌ని పరీక్షించగా 10వేల 825 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4లక్షల 87వేల 331కి చేరింది. తాజాగా 71 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 4వేల 347కి చేరింది. 11,941 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

నెల్లూరులో 13 మంది, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు 3లక్షల 82వేల 104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,880 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.