చేతకానోడు, పనికిరానోడు.. అనంతపురం జిల్లా కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ చంద్రుడు అనంతపురం జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేతకాని, పనికిరాని కలెక్టర్ అంటూ కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కలెక్టర్ హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే గంధం చంద్రుడిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

చేతకానోడు, పనికిరానోడు.. అనంతపురం జిల్లా కలెక్టర్ పై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

Mla Kethi Reddy

ysrcp mla sensational comments on collector: అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడిపై ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ చంద్రుడు అనంతపురం జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చేతకాని, పనికిరాని కలెక్టర్ అంటూ కేతిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు, మంత్రులను కలెక్టర్ హీనంగా చూస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే గంధం చంద్రుడిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

జిల్లాకు మేజిస్ట్రేట్ అయితే చంపేస్తారా అని ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశ్నించారు. తన 15 ఏళ్ల రాజకీయ జీవితంలో గంధం చంద్రుడు అంత పనికిమాలిన కలెక్టర్‌ను చూడలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ ఇవాళ ఉండి, రేపు పోతాడు… ఎవడిని నాశనం చేయడానికి గంధం చంద్రుడు పుట్టాడంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. పత్రికల్లో హనీట్రాప్ రాకపోతే ఎప్పుడో పోయేవాడని వ్యాఖ్యానించారు. కలెక్టర్ ప్రజా సేవకుడని, తాము ప్రజా ప్రతినిధులమని స్పష్టం చేశారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలెక్టర్‌ లెక్క చేయట్లేదని.. ఎమ్మెల్యేలు గాడిదలు కాయడానికి ఉన్నామా? అని ఫైరయ్యారు.

సీఎంవో, మంత్రులకు కలెక్టర్‌ రాంగ్‌ ఫీడింగ్‌ ఇస్తున్నారని, కలెక్టర్ చేసిన పనికిమాలిన పనులు చెప్పాలంటే పేజీలు చాలవని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాడని.. కలెక్టర్ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని కేతిరెడ్డి హెచ్చరించారు. కలెక్టర్ చంద్రుడు.. ఎమ్మెల్యేలను వెధవలను చూసినట్లు చూస్తున్నాడని.. చివరికి మంత్రుల పట్ల కూడా అలాగే వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఫైరయ్యారు. ఈ జిల్లాలో ఏం పరిపాలన జరుగుతుందో తనకు తెలియట్లేదని.. ఎవ్వడూ పై నుంచి దిగి రాలేదని అన్నారు.

ఒక పనికిమాలిన, ఈగోయిస్టిక్ కలెక్టర్ వల్ల చిల్లవారిపల్లెలో సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన పండుగను జరిపించనందుకు బాధగా ఉందన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. గ్రామంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కలెక్టర్ ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. కలెక్టర్ గంధం చంద్రుడు ఎలాంటి పని చేయడని, పక్కనోళ్లు చేసిన పని క్రెడిట్ తాను లాక్కుంటారని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ‘కిసాన్ అవార్డు’ కూడా ఆయన పని చేస్తే వచ్చింది కాదని, జాయింట్ కలెక్టర్ కష్టపడితే గంధం చంద్రుడు క్రెడిట్ కొట్టేశారని ఎమ్మెల్యే చెప్పారు.

కాగా, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ప్రజల్లో చెరగని ముద్ర వేశారు గంధం చంద్రుడు. జిల్లాలో కుల వివక్షను రూపు మాపేందుకు తన వంతుగా ప్రయత్నం చేశారు. దేశంలోనే తొలిసారిగా కులాలను సూచించేలా ఉన్న కాలనీ పేర్లు తొలగించాలని ఆదేశించారు. మాల పల్లె, మాదిగ పల్లె, హరిజనవాడ, దళితవాడ వంటి కులాలను సూచించే పేర్లను మార్చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను దేశంలోనే తొలిసారి ఏపీలోని అనంతపురం జిల్లాలో ఆయన అమలు చేశారు. అలాంటి కలెక్టర్‌ పై ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు జిల్లాలో సంచలనంగా మారాయి.