YSRCP MP Vijayasai Reddy : రాజీనామా చేస్తా- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.

YSRCP MP Vijayasai Reddy : రాజీనామా చేస్తా- వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

YSRCP MP Vijayasai Reddy : విశాఖ రైల్వేజోన్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాట్ కామెంట్ చేశారు. రైల్వేజోన్ రాకపోతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. రైల్వేజోన్ పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విశాఖ రైల్వేజోన్ వచ్చి తీరుతుందన్నారు. కేంద్ర హోంశాఖ సమావేశంలో రైల్వేజోన్ అంశం చర్చకే రాలేదన్నారు. గుర్రం జాషువా జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

”పునర్ విభజన చట్టంలో రైల్వేజోన్ కు సంబంధించి చాలా స్పష్టంగా చెప్పబడింది. రాజధానిని కనెక్ట్ చేస్తూ రైల్వే లైన్ నిర్మాణం జరగాలన్నది నిన్నటి ప్రతిపాదన. దాని మీదే డిస్కషన్ జరిగింది. రైల్వేజోన్ నిర్మాణానికి సంబంధించి మొత్తం కేంద్రమే ఖర్చు భరించాలన్నది పునర్విభజన చట్టంలో ఉంది. ఇదే ఏపీ వాదన. దీనికి సంబంధించిన చర్చ వచ్చిందే కానీ, రైల్వేజోన్ కి సంబంధించిన చర్చ రాలేదు. రైల్వే జోన్ తప్పకుండా వస్తుంది” అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

విశాఖ రైల్వే జోన్ ను ఇవ్వడం సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చేసినట్టు మీడియాలో వచ్చిన వార్తలు దుమారం రేపాయి. ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఈ వార్తలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని ఆయన తేల్చి చెప్పారు. కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి సమావేశంలో విశాఖ రైల్వే జోన్ అంశం చర్చకే రాలేదని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ వచ్చి తీరుతుందని… రైల్వే జోన్ రాకపోతే రాజీనామా చేస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే ఎల్లో మీడియా ఇలాంటి తప్పుడు వార్తలను రాస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

విశాఖ రైల్వే జోన్ అనేది విభజన చట్టంలో చాలా స్పష్టంగా ఉందని విజయసాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే జోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ అంశంలో ఇంత స్పష్టత ఉన్నప్పటికీ… ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. అవాస్తవాలను ప్రచురిస్తూ సమాజంలో వారికున్న స్థాయిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు విజయసాయిరెడ్డి.

మరోవైపు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పిందంటూ వచ్చిన కథనాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం స్పందించారు. రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. జోన్ ఏర్పాటుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖ జోన్ ఏర్పాటుపై పునరాలోచిస్తే కనుక ఆ విషయం చెబుతామని అన్నారు.

కాగా, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కుదరదని కేంద్రం అన్నట్టుగా వచ్చిన కథనాలను ఇప్పటికే రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు (బీజేపీ), విజయసాయిరెడ్డి (వైసీపీ) ఖండించారు. మీడియా అపోహలు సృష్టించే ప్రయత్నం చేయరాదని జీవీఎల్… మీడియాలోని ఓ వర్గం ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తోందని విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో, కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరణతో ఈ అంశంలో స్పష్టత వచ్చినట్టయింది.