వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్లాన్‌.. టీడీపీ‌లో టెన్షన్!

  • Published By: sreehari ,Published On : March 16, 2020 / 03:45 PM IST
వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ ప్లాన్‌.. టీడీపీ‌లో టెన్షన్!

ఏపీలో అధికార వైసీపీ ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్‌తో హోరేత్తిస్తోంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నేతలను తమ వైపు లాక్కుంటూ ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది. అయితే ఈ ఆకర్ష్‌లో నేతలే కాదు ఎమ్మెల్యేలూ క్యూ కడుతున్నారట. ఆపరేషన్ ఆకర్ష్‌తో ప్రతిపక్ష పార్లీని దెబ్బ తీయడంలో సఫలం అవుతున్నా వైసీపీలో మాత్రం ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక ఎన్నికల ముందు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, కదిరి బాబూరావు, రెహమాన్‌ వంటి నేతలు నేతలు వైసీపీలో చేరారు. ఇంకా మరికొంత మంది నేతలు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. 

వారికే నియోజకవర్గ బాధ్యతలు :
మరోపక్క, ప్రతిపక్ష పార్టీ నేతల చేరికపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న నేతల మద్యే విభేదాలు, గ్రూపు రాజకీయలు బయటపడుతున్న నేపథ్యంలోప్రతిపక్ష నేతలు వచ్చి చేరుతుండడంతో ఇవి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. పార్టీలో చేరకపోయినా వారికే నియోజకర్గ బాధ్యతలు అప్పగించారు. అయితే, ఆయా చోట్ల ఎమ్మెల్యేలకు వైసీపీ ఇన్‌చార్జ్‌లకు మధ్య సయోధ్య కుదరడం లేదని అంటున్నారు. మొదట చేరిన వల్లభనేని వంశీ నియోజకవర్గం గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావ్‌కు వంశీకీ ఇంకా సయోధ్య కుదరలేదు. తర్వాత గుంటూరు ఈస్ట్‌లోనూ మద్దాల గిరికి వైసీపి నేతలకు అంతగా పొసగడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. 

అదే రిపీట్ అవుతుందా? :
ఇక తాజాగా చీరాల నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి రిపీట్ అవుతోంది. కరణం బలరాంకు ఆమంచికి ఉన్న విభేదాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. టీడీపీ కీలక నేత రామసుబ్బారెడ్డి చేరికతో జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అయిష్టంగానే ఉన్నారు. మరో నేత కదిరి బాబూరావు చేరికతో దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ది సైతం అదే పరిస్థితి. వీరంతా సీఎం జగన్‌ను కలసి పార్టీలో చేరే సమయంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు రాకపోవడం వారి అసంతృప్తిని తెలియజేస్తోందని అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. ఇప్పుడు అదే రిపీట్‌ అవుతోందని చెబుతున్నారు. అప్పట్లో టీడీపీలో కూడా వైసీపీ నుంచి చేరికలపై అప్పటికే పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి వ్యక్తమైందని, అదే పార్టీ కొంప ముంచిందని అంటున్నారు. ఇప్పుడు వైసీపీలోకి టీడీపీ నేతల రాకతో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయని అనుకుంటున్నారు. ఇప్పటి వరకూ బహిరంగంగా ఎవరూ చెప్పనప్పటికీ లోలోపల మదనపడుతున్నారట. గతంలో తమను అనేక ఇబ్బందులకు గురి చేసిన వారే మళ్లీ తమపై పెత్తనం చేయడానికి వస్తున్నారంటూ ఆవేదన వ్యకం చేస్తున్నారని అంటున్నారు. మరి ఈ సమస్యను జగన్‌ ఎలా అధిగమిస్తారో చూడాలి.