నామినేషన్ల చివరి రోజు రచ్చ చేసిన వైసీపీ.. ప్రజాస్వామ్యం లేదంటున్న టీడీపీ

నామినేషన్ల చివరి రోజు రచ్చ చేసిన వైసీపీ.. ప్రజాస్వామ్యం లేదంటున్న టీడీపీ

మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఇవాళ పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీలో ఉద్రిక్తల మధ్య మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపాలిటీలో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీ 27వ వార్డులో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థి ప్రమీలను వైసీపీ అభ్యర్థి రామలింగా చారి అడ్డుకున్నాడు. అనంతరం ప్రమీల నామినేషన్ పత్రాలను చించేసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు రామలింగా చారిని అదుపులోకి తీసుకున్నారు. 
         
అటు తాడిపత్రి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద  మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు కార్యాలయం వద్దకు భారీగా చేరుకోవడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని అదుపుచేశారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి… టీడీపీ తరఫున నామినేషన్‌ వేస్తున్నవారిని అడ్డుకుని బెదిరిస్తున్నారని 36వ వార్డు టీడీపీ అభ్యర్థిని లక్ష్మీదేవి ఆరోపించారు.  
     
విషయం తెలుసుకున్న జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయంలోకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్‌ ఉన్నందున తర్వాత పంపిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులు మాట్లాడుతుండగా… వైసీపీ నాయకులు ఒక్కసారిగా దివాకర్‌రెడ్డివైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుని జేసీని అక్కడి నుంచి పంపించారు. అయినా కార్యాలయం వెలుపల ఇరువర్గాలు గుమిగూడటంతో ఏమి జరుగుతుందోనన్న టెన్షన్‌ వాతావరణం నెలకొంది. 

అధికార పార్టీ.. టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తోందని జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌ ఆరోపించారు. తాడిపత్రిలో జరుగుతున్న దౌర్జన్యాలను ఈసీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
     
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీ 9వ వార్డు టీడీపీ అభ్యర్థి సీత నామినేషన్‌ వేసేందుకు రాగా… ప్రత్యర్థులు నామినేషన్ పత్రాలను చించివేశారు. అధికారులు చిరిగిన పత్రాలు తీసుకునేందుకు ససేమిరా అనడంతో ఆమె అక్కడే ఆందోళనకు దిగారు. సరైన పత్రాలు లేకుండా తాము నామినేషన్‌ను స్వీకరించలేమని అధికారులు తేల్చి చెప్పడంతో టీడీపీ అభ్యర్థిని తనకు న్యాయం చేయాలంటూ కన్నీరు మున్నీరయ్యారు.
     
అటు చిత్తూరు జిల్లా పుంగనూరులోను వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు. 16వ వార్డు టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన వ్యక్తినుంచి నామినేషన్ పత్రాలను లాక్కున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారుల ఎదుటే నామినేషన్ పత్రాలు చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.
     
మొత్తంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతల మధ్య మున్సిపల్‌, కార్పొరేషన్‌ నామినేషన్‌ల నామినేషన్ల ఘట్టం ముగిసింది. శనివారం నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. ఈనెల 23న పోలింగ్‌, 27న కౌంటింగ్‌ జరగనుంది.