వైసీపీని వెంటాడుతున్న అమరావతి ఓట్ల కోసం చేసిన భీషణ ప్రతిజ్ఝలు

వైసీపీని వెంటాడుతున్న అమరావతి ఓట్ల కోసం చేసిన భీషణ ప్రతిజ్ఝలు

మూడు రాజధానుల ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చట్టంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానంలో ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకే ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు అమరావతిని తరలించబోమంటూ జగన్‌ సహా వైసీపీ నేతలు ఇచ్చిన హామీలు, చేసిన భీషణ ప్రతిజ్ఞలు ఇప్పుడు బయటకొస్తున్నాయి. వివిధ చానళ్లు, పత్రికలు వాటిని పదేపదే ప్రసారం చేస్తుంటే.. సామాజిక మాధ్యమాలు హోరెత్తిస్తుంటే.. అధికార పక్షం నేతల్లో అలజడి మొదలైంది.

టీడీపీకి అనవసరంగా అస్త్రం ఇచ్చినట్లు అయిందని.. ప్రజల ముందు బోనులో నిలబడాల్సిన పరిస్థితి తలెత్తిందని.. ఇలాంటి పరిణామాన్ని తాము ఊహించలేదని కొందరు వైసీపీ నేతలు అంగీకరిస్తున్నారు. నిండు శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటును గట్టిగా సమర్థిస్తూ జగన్‌ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అమరావతిని కొనసాగిస్తామని, రాజధాని నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని వైసీపీ మేనిఫెస్టో కమిటీ స్పష్టం చేసింది.

ఈ సమావేశం వివరాలను విజయవాడ వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు. ఇది స్వయంగా జగన్‌ మాటగా చెబుతున్నామని గట్టిగా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోలగట్ల వీరభద్రస్వామి, వసంత కృష్ణప్రసాద్‌ తదితరులు కూడా రాజధాని మారబోదని తేల్చిచెప్పారు. కానీ ఇందుకు విరుద్ధంగా అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచి రాజధాని తరలించే ఉద్దేశంతో జగన్‌ గత టీడీపీ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు చేశారు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని చెప్పినప్పటికీ 14 నెలలు గడిచినా నిరూపించలేకపోయారు. ఆ తర్వాత అమరావతికి లక్ష కోట్ల రూపాయలు వ్యయం చేయలేమని.. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు జగన్‌. రాజధానులపై మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదని టీడీపీ సహా విపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని మాజీ సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. సీఎంకు 48 గంటల గడువిచ్చారు.

మళ్లీ వైసీపీ గెలిస్తే రాజధానులపై మాట్లాడబోమన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి మళ్లీ గెలిచి రావాలని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి సవాళ్లు విసురుతున్నా.. వారి వాదనలో పసలేదని వైసీపీ నేతల్లోనే వినిపిస్తోంది.

రాజధానులపై తాజాగా ప్రజాభిప్రాయం కోరాలన్న చంద్రబాబు డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంటోంది. మరోపక్క జనసేన అధినేత పవన్‌ కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇది అటు తిరిగీ ఇటు తిరిగీ తమ మెడకు చుట్టుకుంటుందేమోనని ఈ రెండు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గతంలో అమరావతి కదలదంటూ శపథాలు చేసిన నేతలు ఇప్పుడు వాటిని సమర్ధించుకోలేక.. కొట్టిపారేయలేక ముఖం చాటేస్తున్నారు.

అంతేనా.. విపక్షాలపై ఎదురుదాడికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం మాత్రం లేకుండా పోతోందని వైసీపీ నేతలే అంటున్నారు. అప్పుడు ప్రజలకు అలా చెప్పి… ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఒకవేళ రాజీనామా చేస్తే ఈ రెండు జిల్లాల్లో పార్టీ నష్టపోక తప్పదనే భయం వారిలో కనిపిస్తోందట. కానీ బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అనుకుంటున్నారు.