జగనన్న తోడు..సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు..ఎవరు అర్హులు

  • Published By: madhu ,Published On : July 13, 2020 / 08:27 AM IST
జగనన్న తోడు..సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు..ఎవరు అర్హులు

పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్…మరో పథకం అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అధిక వడ్డీలతో సతమతమౌతున్న చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు ‘జగనన్న తోడు’ పథకం అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం. కేవలం సున్నా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ నెలలో బ్యాంకు రుణాలిప్పించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. రూ. 10 వేల చొప్పున రుణాలు ఇప్పించి వడ్డీ డబ్బులను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో టీ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపై టిఫిన్‌ విక్రయాలు తదితర చిరు వ్యాపారాలకు లబ్ధి చేకూరనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరందరికీ…గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.

* చిరు వ్యాపారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.
* ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి.
* రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై, ప్రజా, ప్రైవేట్‌ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకునేవారు, తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.
* ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్‌ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు కూడా అర్హులే.
* గ్రామాల్లో, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.