లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..? ప్రణయ్‌, హేమంత్ ఘటనలు మరువక ముందే తెలంగాణలో మరో దారుణం

Published

on

honour killing in telangana: పరువు పేరుతో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌, హేమంత్ ఘటనలు.. ఇంకా కళ్ల ముందు కదలాడుతునే ఉన్నాయి. ఇంతలోనే మరో పరువు హత్య. మూడు ఘటనల్లో పాత్రలు వేరు..వ్యక్తులు వేరు.. కానీ జరిగిన కథ ఒక్కటే. కుల పిచ్చితో అమ్మాయి బంధువులు దారుణాలకు ఒడిగడుతున్నారు. పరువు పరువు అంటూ నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

పాత్రలు మారాయి..వ్యక్తులు మారారు.. కానీ..అప్పుడు..ఇప్పుడు ఒకటే కథ.. కూతుళ్ల మీద ప్రేమతో నేరస్థులుగా మారుతున్న తల్లిదండ్రులు..

ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..?
అనాదిగా అదే రక్త చరిత్ర. అబ్బాయీ, అమ్మాయీ ప్రేమించుకోవడం, అటువైపో…,ఇటువైపో ఎవరో ఒకరి కుటుంబానికి నచ్చకపోవడం, ఆపై ఎవరినో ఒకరిని చంపేయడం…కని పెంచి మిమ్మల్ని ప్రయోజకులుగా చేసిన మమ్మల్నే తిరస్కరిస్తారా…అనే తట్టుకోలేని భావనతో తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారు. కానీ వయసొచ్చిన పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తాయని ఆలోచించట్లేదు. మా మాటే వినాలి, మేం చెప్పినట్లే నడుచుకోవాలనే ధోరణి…పంతాలకు దారితీసి, ప్రాణాలను హరిస్తోంది. తమకు ఇష్టం లేని వివాహాలు చేసుకున్నారని నవ దంపతులతో పాటు అవతలి వైపు ఫ్యామిలీని కూడా హత్యలు చేయడానికి తల్లిదండ్రులు వెనుకాడకపోవడం అత్యంత దారుణ విషయం. ఏం సాధించడానికి ఈ పరువు హత్యలు..? పరువు కోసం పాకులాడి, ప్రాణాలు తీసి, జీవితం జైలుపాలు చేసుకుని…అయినవాళ్లు సాధించేదేంటి..?

తండ్రిని బలి తీసుకున్న కొడుకు ప్రేమ
ప్రణయ్, హేమంత్ ఘటనలు మరువకముందే తెలంగాణలో మరో చోట పరువు హత్య కలకలం సృష్టించింది. అయితే ఈ సారి అబ్బాయి తండ్రి బలైపోయాడు. కొడుకు మీద ప్రేమ తండ్రి ప్రాణాలు బలి తీసుకుంటే… కూతురు ప్రేమ తల్లిదండ్రులను నేరస్థులుగా చేసింది. ప్రేమ వ్యవహారంతో పరువు పోయిందని పట్టలేని ఆగ్రహంతో యువకుడి తల్లిదండ్రులపై యువతి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడి తండ్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో ప్రేమ కథ ఉద్రిక్తతలకు దారి తీయగా.. కొడుకు ప్రేమకి తండ్రి ప్రాణాలు కోల్పోవడం మాత్రం విషాదాన్ని నింపింది.

కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరణ:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దల నుంచి నిరాకరణ ఎదురైంది. కూతురి ప్రేమ వ్యవహారంతో పరువు పోతుందని భావించిన యువతి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. పెద్దల తీరుతో తమ ప్రేమ విఫలమవుతుందని భావించిన మహేష్.. ప్రియురాలితో కలిసి ఊరు వదిలి వెళ్ళిపోవడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి.

మహేష్ తల్లిదండ్రులపై దాడి.. అక్కడికక్కడే కుప్పకూలిన లక్ష్మీనారాయణ
కూతురు ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు అవమాన భారంతో కుమిలిపోయారు. అక్టోబర్ 27న యువతి కుటుంబసభ్యులు ఆగ్రహంతో మహేష్ తల్లిదండ్రులు లక్ష్మీ నారాయణ, విజయపై దాడికి తెగపడ్డారు. కంటి చూపు సరిగా లేని లక్ష్మీ నారాయణ దాడి నుంచి తప్పించుకోలేక పోవడంతో… తీవ్ర గాయలపాలయ్యాడు. వృద్ధుడు కావడంతో దెబ్బలకు తాళలేక.. అక్కడే కూలపడ్డాడు. గ్రామస్థులు హుటాహుటిన వేములవాడ హాస్పిటల్ కి తరలించినప్పటికి పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. చికిత్స పొందుతూ లక్ష్మీ నారాయణ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.

తమ కొడుకు ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో కూడా తెలుసని మృతుడి భార్య చెబుతోంది. యువతి ఫోన్ చేసి తీసుకెళ్లమంటేనే తన కొడుకు తీసుకెళ్లాడని.. ఇదే విషయం యువతి ఇంట్లో కూడా చెప్పామన్నారు. అయినప్పటికీ వాళ్లు పట్టించుకోకుండా.. పెళ్లి జరిగిన తర్వాత వచ్చి తమపై దాడి చేసి తన భర్తను పొట్టన పెట్టుకున్నారని వాపోయింది. లక్ష్మీ నారాయణ మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రెండు కుటుంబల మధ్య పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉందనే నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

కూతురి ప్రేమను ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే..ఇక్కడి వరకు వచ్చేది కాదేమో. కేవలం క్షణికావేశంలో తీసుకున్న వాళ్ల నిర్ణయం.. ఆ యువకుడి తండ్రిని అన్యాయంగా బలి తీసుకుంది. ఏది ఏమైనా కుల మధ్య చిచ్చు.. ప్రెస్టీజ్ ఇష్యుకి లక్ష్మినారాయణ తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకోవాల్సి వచ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *