another-shock-for-chandrababu-ganta-srinivasa-rao-to-join-ysrcp

చంద్రబాబుకి ఇంకో షాక్? వైసీపీలోకి మరో ఎమ్మెల్యే..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ganta srinivasa rao: ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా టీడీపీని వీడుతున్నారు. అధికార వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం అయ్యారు. తాజాగా మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. శనివారం(అక్టోబర్ 3,2020) గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ ని కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

తన కుమారుడితో కలిసి జగన్ వద్దకు:
తన కుమారుడు రవితేజను వెంటపెట్టుకుని గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ దగ్గరికి వెళ్లే చాన్స్ ఉందంటున్నారు. అదే రోజు తాడేపల్లికి రావాలని విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. వైసీపీలో చేరేందుకే గంటా శ్రీనివాస రావు జగన్ ను కలుస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరేందుకు కొంతకాలంగా గంటా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గంటా రాకను మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సీఎం జగన్ తో భేటీ తర్వాత గంటా వైసీపీలో చేరతారని తెలుస్తోంది. అదే సమయంలో మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఇతర ఎమ్మెల్యేల మాదిరిగానే గంటా సైతం నేరుగా వైసీపీలో చేరకుండా జగన్ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తారనే వార్తలూ వినిపిస్తున్నాయి. గంటా టీడీపీలో యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

మూడు రాజధానుల అంశంతో మారిన రాజకీయాలు:
గత ఎన్నికాల్లో వైసీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికీ విశాఖ నగర పరిధిలో టీడీపీ కొంత మేరకు సత్తా చాటింది. నాలుగు దిక్కులు నాలుగు స్తంభాల్లా నలుగురు అభ్యర్థులు గెలిచారు.

దక్షిణం నుంచి వాసుపల్లి గణేశ్‌, ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, పశ్చిమం నుంచి గణబాబు, తూర్పు నుంచి వెలగపూడి రామకృష్ణబాబు విజయకేతనం ఎగురవేశారు. ఆ తర్వాత పార్టీ ఓటమిపై చంద్రబాబు సమీక్షలు మొదలుపెట్టడం.. మేయర్‌ పీఠం ఎలాగైనా గెలుచుకోవాలని చెప్పడం.. కొద్ది కాలానికి సీఎం జగన్ మూడు రాజధానుల ఆంశం తెర మీదకు తేవడంతో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి.

ఒక్కొక్కరు సైకిల్ దిగుతున్నారు:
ఒకవైపు టీడీపీ అధిష్టానం అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ పోరాడుతుంటే మరోవైపు ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు విశాఖను పాలనా రాజధానిగా చేసే నిర్ణయానికి మద్దతు ఇచ్చారు. కొన్ని సమస్యలపై అధిష్టానం స్పందించకపోవడంతో ఒక్కొక్కరు సైకిల్ దిగి ఫ్యాన్ స్విచ్ వేయడం మెుదలు పెట్టారు. ఇందులో మెుదటిగా పార్టీ విశాఖ రూరల్‌ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు ఫ్యాన్‌ గూటికి చేరిపోయారు.

అదే బాటలో వాసుపల్లి గణేశ్‌ కూడా వెళ్లిపోయారు. మరోపక్క, గంటా శ్రీనివాసరావు, గణబాబు కూడా రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ పట్టు తప్పిపోకుండా ఉండేలా అందరినీ కలుపుకొనిపోయే నాయకుడిని అన్వేషించే పనిలో అధిష్టానం ఉందంటున్నారు.

READ  కమలాపురం కలహం : వీరశివారెడ్డి వెనక్కి తగ్గుతారా

విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవలే వైసీపీకి జైకొట్టారు. ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా, తన ఇద్దరు కుమారులను సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించారు.

గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విజయసాయిరెడ్డి, అవంతి:
గంటా వైసీపీలో చేరుతున్నట్టు ఈ ఏడాది ఆరంభం నుంచి పలు డేట్లు తెరపైకి వచ్చాయి. కాగా, గంటా శ్రీనివాసరావు చేరికను విజయసాయిరెడ్డి బలంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు మీద భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో అప్పటి అధికార టీడీపీ మీద వైసీపీ చేసిన విమర్శల్లో అది కూడా ఒకటి.

టీడీపీ హయాంలోనే విశాఖలో భూముల ఆక్రమణల మీద సిట్ ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వం వచ్చాక విశాఖలో భూ ఆక్రమణల మీద సిట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. భూ ఆక్రమణల మీద తీవ్ర ఆరోపణలు చేసిన తామే ఇప్పుడు అలాంటి నేతను వైసీపీలోకి చేర్చుకుంటే పార్టీ కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని విజయసాయిరెడ్డి వాదనగా ఉంది. గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఉన్నారు.

గంటాను వైసీపీలోకి రానివ్వడం వెనుక జగన్ వ్యూహం:
ఇద్దరు బలమైన నేతలు వద్దంటున్నా గంటాను వైసీపీలోకి తీసుకొస్తోంది ఎవరనే చర్చ వైసీపీలో జరుగుతోంది. వారిద్దరినీ కాదని ఏకంగా జగన్ వద్దకు గంటాను తీసుకుని వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న నేత ఎవరనే చర్చ జరుగుతోంది. విశాఖపట్నం త్వరలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. అలాంటి చోట ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

2019 ఎన్నికల్లో విశాఖ నగరంలో టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిచింది. వారిలో ఒకరు వైసీపీలో చేరిపోయారు. మిగిలిన ముగ్గుర్ని కూడా వైసీపీలోకి తీసుకొస్తే టీడీపీ ఖాళీ అవుతుందని వైసీపీ భావన. అందుకే ఎవరు వ్యతిరేకించినా అవేవీ పట్టించుకోకుండా నేతల వలసలను జగన్ ప్రోత్సహిస్తున్నారనే వాదనా ఉంది. టీడీపీని ఖాళీ చేస్తే వచ్చే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో జీవీఎంసీ మీద వైసీపీ జెండా ఎగరేయడం సులువు అవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది.

Related Posts