మరో ఇద్దరు వైసీపీ ఎంపీలకు కరోనా, లక్షణాలు లేకుండానే ఒకరికి పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ మహమ్మారి సామాన్యులనే కాదు ప్రజాప్రతినిధులను కూడా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కోవిడ్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలకు కరోనా టెస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పలువురికి పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో ఇద్దరు వైసీపీ ఎంపీలకు కోవిడ్ సోకింది. అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు మాధవి, రెడ్డప్ప ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్ సెక్రటేరియట్ నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఎంపీలు మాధవి, రెడ్డప్పకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

కాగా, ఎంపీ రెడ్డప్పకు ఎలాంటి లక్షణాలు లేవు. అయినా కరోనా ఉన్నట్టు నిర్దారణ అయ్యింది. ఇక ఎంపీ మాధవి జ్వరంతో బాధపడుతున్నారు. ఎంపీ మాధవి 2వారాల పాటు ఢిల్లీలోనే ఉండి చికిత్స తీసుకోనున్నారు. ఐసోలేషన్‌లో ఉండాలని రెడ్డప్పకు అధికారులు సూచించారు. దీంతో ఆయన లోక్‌సభ సమావేశాలకు దూరం అయ్యారు. ఇక మాధవి కూడా సెషన్స్ కు దూరంగా ఉండనున్నారు.

కాకినాడ ఎంపీ వంగ గీతా సైతం ఇదివరకే వైరస్‌ బారినపడిన విషయం తెలిసిందే. గత శనివారం ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కారణంగానే ప్రత్యేక పరిస్థితుల నడుమ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు.

దేశంలోనే మొదటిసారిగా..హైదరాబాద్ లో కరోనా పేషెంట్ కు ఊపిరితిత్తుల మార్పిడి


ఏపీలో ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, ఆర్కే, దాడిశెట్టి రాజా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటూ మరికొందరు ప్రజా ప్రతినిధులు కరోనా బారినపడ్డారు. ఎంపీల్లో విజయసాయిరెడ్డి, వంగా గీత, రెడ్డప్ప, మాధవిలు ఉన్నారు.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 72వేల 233 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 9వేల 536 మందికి పాజిటివ్‌ అని తేలింది. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.67లక్షలకు పెరిగింది.

READ  మదర్సాల్లో హనుమాన్ చాలీసా తప్పనిసరి చేయాలి : బీజేపీ నేత

కొత్త కేసులతో పాటు కరోనా మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మహమ్మారి కాటుకు 66 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా ఏడుగురు చొప్పున.. కడప, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున.. చిత్తూరు, తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఐదుగురు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

గుంటూరులో నలుగురు, విజయనగరంలో నలుగురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4వేల 912కు పెరిగింది.

Related Posts