ఏపీలో పవర్ కోసం బీజేపీ కొత్త వ్యూహం, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Pawan Kalyan: ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా మారాలని అనుకుంటున్న బీజేపీ కొత్త కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే బలమైన కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిన బీజేపీ… ఆ సామాజికవర్గంలో కీలక నేతల్ని తమ వైపు తిప్పుకుంటోంది. ఇక తాజాగా జనసేన అధినేత పవన్‌పై ఫోకస్ పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఇకపై ఏ కార్యక్రమం చేసినా పవన్‌తోనే కలసి చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రజా సమస్యలపై స్పందించడం వంటివి కలిసే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ క్యలాణ్‌ను ముందు పెట్టి రాజకీయాలు చేయాలని డిసైడ్ అయిందట.

పవన్ అండతో బలపడాలని నిర్ణయం:
ఏపీ బీజేపీలో పెద్దగా ప్రజాకర్షణ ఉన్న నేత లేకపోవడం, పవన్‌కు కాపు సామాజికవర్గంతో పాటు యువతలోనూ ఫాలోయింగ్ ఉన్నందున ఆయన అండతో బలపడాలని భావిస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల్లో జనసేన పార్టీ కొన్ని చోట్ల ఎక్కువ సంఖ్యలో ఓట్లు రాబట్టడం వంటి అంశాలతో పవన్‌నే కీలకంగా చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా చెబుతున్నారు.

పవన్‌ని ముందు పెట్టడం అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనల తరపున సీఎం అభ్యర్థిగా ఆయననే ఫిక్స్‌ చేయాలని భావిస్తోందని అంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలపైనే ఇటీవల చిరంజీవి, పవన్‌తో భేటీ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదే ప్రతిపాదన వారి ముందుంచారట. పవన్‌తో పాటు కాపు సామాజికవర్గానికి చెందిన ముద్రగడ, వంగవీటి రాధాలను తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

అధికారమే లక్ష్యంగా పావులు:
ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని చెబుతోన్న సోము వీర్రాజు ఈ దిశగా పావులు కాదుపుతున్నారట. వీర్రాజు కూడా కాపు సామాజికవర్గానికి చెందిన నేతే కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. పవన్‌కల్యాణ్‌కు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఆయనంటే విపరీతమైన అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఓట్ల రూపంలో మలచుకోవడానికి ఇప్పటి నుంచే ప్లాన్స్‌ సిద్ధం చేసుకుంటున్నాయి బీజేపీ, జనసేన. పవన్‌ కల్యాణ్‌ కూడా జిల్లాల వారీగా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోబోతున్నారని చెబుతున్నారు. మరి బీజేపీ మున్ముందు ఎలాంటి వ్యూహాలతో అడుగులు వేయబోతుందో చూడాలి.

Related Posts