ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం షురూ..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందనే టాక్‌ వినిపిస్తోంది. సీఎం జగన్‌కి పండితులు ఓ ముహూర్తం సూచించారట. జూలై 22న కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ చేస్తే బాగుంటుందని చెప్పారట. ప్రస్తుతం జరుగుతున్న ఆషాడం ముగిస్తే.. శ్రావణమాసానికి టైం ఫిక్స్ చేశారట.

పండితుల సూచన మేరకు జూలై 22న క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో వారి స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులను తీసుకోవాల్సి ఉంది. వారిద్దరూ బీసీ సామాజికవర్గానికే చెందిన వారు కావడంతో కొత్త మంత్రులు కూడా బీసీలకే ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.

రెండు ఖాళీలకు ప్రయత్నిస్తున్న వారి జాబితా పొడుగ్గా ఉంది. ప్రాంతాలు, సామాజికవర్గాల వారీగా ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఈ రెండు మంత్రి పదవులతో పాటు మరో కీలక పదవీ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. కాకపోతే ఆ పదవి కోసం ఎమ్మెల్యేలు కాకుండా ఇప్పుడున్న మంత్రులు దానిపై కన్నేశారట. ఆ కీలక పదవి కోసం మంత్రులు పోటీ పడుతున్నారట.

పిల్లి సుభాష్‌ ప్రస్తుతం మంత్రిగానూ, ఉప ముఖ్యమంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామా తర్వాత ఖాళీ అయ్యే డిప్యూటీ సీఎం పోస్టు మీద ఇప్పుడు చర్చ మొదలైందంటున్నారు. ఖాళీ అయ్యే మంత్రి పదవులు భర్తీ చేసినా చేయకపోయినా.. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేశాక ఆయన డిప్యూటీ సీఎం పదవిని మాత్రం భర్తీ చేయాల్సి ఉందంటున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టి… అదే సామాజికవర్గం మంత్రితో ఆ స్థానం భర్తీ చేయాల్సి ఉంటుంది.

మంత్రిమండలిలో ఉన్న బీసీ మంత్రులు ఆ పదవి కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్‌ దృష్టిలో పడేందుకు పోటీ పడుతున్నారట. తమ వంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు కొందరు మంత్రులు.

ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో ఉన్న బీసీ వర్గానికి చెందిన శంకర నారాయణ, అనిల్ కుమార్, ధర్మాన కృష్ణదాస్, జయరాం ఉన్నారు. వీరిలో శంకర నారాయణ, ధర్మాన కృష్ణదాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ధర్మాన కృష్ణదాస్‌కు చాన్సులు ఎక్కువగా ఉన్నాయన్నది టాక్‌. మరోపక్క, ఒకవేళ పిల్లి సుభాష్‌, మోపిదేవి వెంకట రమణ స్థానంలో ఇద్దరు కొత్త మంత్రులను కూడా ఇప్పుడే తీసుకుంటే వారిలో ఒకరికి డిప్యూటీ సీఎం ఇస్తారేమోనన్న అనుమానాలు కూడా ఉన్నాయట.

ముమ్మిడివరం ఎమ్మెల్యే పి.సతీష్ మత్స్యకార వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మోపిదేవి కూడా అదే సామాజికవర్గం కావడంతో ఆ ఖాళీని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సతీష్‌తో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం కోసం గట్టి పోటీ ఉంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, జోగి రమేశ్‌ ఆ స్థానం కోసం పోటీ పడుతున్నారట. వారిద్దరూ కృష్ణా జిల్లాకే చెందిన వారు. పిల్లి సుభాష్ సామాజికవర్గానికి చెందినప్పటికీ జోగి రమేశ్‌కు కష్టమేనంటున్నారు. ఆ జిల్లా నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు.

READ  శాసన మండలి ఎదుట బిల్లులు..టీడీపీ సభ్యుల ఆందోళన

మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోదరుడు ప్రసాదరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని కూడా ఓ కీలక నేత ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు టాక్‌. సీఎం జగన్‌ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు కాబట్టి.. ఆయన నిర్ణయం వచ్చే వరకూ ఎదురు చూడక తప్పదని పార్టీలోని కార్యకర్తల మాట.

Related Posts