మంచి కార్యక్రమానికి శత్రువులెక్కువ, చివరికి మంచే గెలుస్తుంది, అతి త్వరలో 30లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Ys jagan on distribution of house sites: ఏపీలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. ఇదో మంచి కార్యక్రమం అని చెప్పిన సీఎం జగన్, ఒక మంచి కార్యక్రమానికి శత్రువులు ఎక్కవుగా ఉన్నారని వాపోయారు. వారి కారణంగా వివిధ వేదికలపై పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీకి చెందిన వారు కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కొంత సమయం పట్టినా చివరకు న్యాయమే గెలుస్తుంది, మంచే గెలుస్తుందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.చివరికి మంచే గెలుస్తుంది:
అతి త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని జగన్ వెల్లడించారు. మంచి రోజు వచ్చే వరకు మనలో స్థైర్యం కోల్పోకూడదన్నారు. ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అనుకున్నాము, కానీ వాయిదా పడిందని జగన్ చెప్పారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలూ పూర్తి కావాలని అధికారులతో చెప్పారు.

ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలు పూర్తి కావాలి:
ప్లాట్ల అభివృద్ధి, మార్కింగ్, లాటరీ తదితర ప్రక్రియలు పూర్తి కావాలన్నారు. సర్గిగా చేయని లే అవుట్లపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. లే అవుట్లలో చెట్లను నాటాలన్నారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కోసం పూర్తి చేయాల్సిన పనులన్నీ పూర్తవ్వాలన్నారు. ఎమ్మార్వోలతో రివ్యూ తీసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఫొటోలు తీసుకోవడం, వారి ప్లాటు హద్దులను తీసుకోవడం తదితర పనులను పూర్తి చేయాలన్నారు. రూ. 22వేల కోట్ల విలువైన ఆస్తులను దాదాపు 30లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయబోతున్నాం అని జగన్ చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమం జరగలేదని జగన్ అన్నారు.వాయిదాల పర్వం నడుస్తోంది:
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న నవరత్నాల అమలులో భాగంగా దాదాపు పాతిక లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఏ ముహుర్తాన తీసుకున్నారో కానీ అప్పటి నుంచీ వరుస వాయిదాల పర్వమే కొనసాగుతోంది. తాజాగా ఆగస్టు 15న నిర్వహించాలని భావించిన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ప్రభుత్వ అంచనా ప్రకారం గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న దీన్ని నిర్వహించే అవకాశాలున్నాయి.

ముచ్చటగా మూడుసార్లు వాయిదా:
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మార్చి 25న ఉగాది సందర్భంగా ఓసారి, ఆ తర్వాత జూలై 8న వైఎస్ జయంతి సందర్భంగా మరోసారి, ఆగస్టు 15తో మరోసారి వాయిదా పడినట్లయింది. దీంతో ఇళ్ల పట్టాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న దాదాపు పాతిక లక్షల మంది పైగా పేదలకు నిరాశ తప్పడం లేదు. అయితే ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి న్యాయపరమైన చిక్కులతో పాటు ఇతరత్రా సమస్యలు కూడా అడ్డంకిగా నిలుస్తుండటంతో ముందుకు వెళ్లలేని పరిస్ధితి ఎదురవుతోంది.గాంధీ జయంతిన పంపిణీ:
ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవ్వాలని భావించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రకటించిన నేపథ్యంలో తదుపరి తేదీ ఎప్పుడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఉండొచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 2న స్వరాజ్య చిహ్నమైన గాంధీ మహాత్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఎలాంటి మార్పులు జరగకపోతే దాదాపు ఈ ముహుర్తం ఖరారయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.


Related Posts