ఏపీలో పెట్రోల్, డీజీల్‌లపై సెస్ విధింపు.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజీల్ లపై సెస్ విధించింది. ఒక్క రూపాయి సెస్ విధిస్తూ శుక్రవారం(సెప్టెంబర్ 18,2020) ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్, డీజీల్ లపై లీటర్ పై రూపాయి సెస్ విధించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మొత్తాన్ని డీలర్ల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం తెలిపింది.

సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం కేటాయించనుంది. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కు కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను ఉపయోగించి రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఇటీవలే సహజవాయువులపై వ్యాట్ ను 14.5శాతం నుంచి 24.5శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. నేచురల్ గ్యాస్ పై వ్యాట్‌ పెంపునకు కరోనా వల్ల ఎదురవుతున్న ఆర్ధిక ఇబ్బందులు, సంక్షేమ పథకాలు కారణంగా ప్రభుత్వం తెలిపింది.

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాల కోసం పెద్ద మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో ప్రభుత్వం పడింది.

రాష్ట్రంలో కరోనా కారణంగా ఖజానాకు రాబడి తగ్గిపోయిందని, ఆదాయం వచ్చే అన్ని దారులూ మూసుకుపోయాయని అందుకే గతంలో వ్యాట్‌ పెంపు, ఇప్పుడు సెస్ విధింపు తప్పడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కూడా ప్రస్తుతం నిధుల కొరత వేధిస్తోందని, ఇలాంటి పరిస్ధితుల్లో సెస్ విధింపుతో కాస్త ఊరట లభిస్తుందని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

కాగా, సహజ వాయువు ధరలపై ప్రభుత్వం వ్యాట్ ను పెంచగా.. వంట గ్యాస్‌ సిలెండర్‌ ధర పెంచినట్టు గతంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. గ్యాస్ సిలెండర్ల ధర జీఎస్టీ పరిధిలో ఉందని, దాని రేట్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం పెంచిన వ్యాట్‌ ప్రభావం గృహ అవసరాలకు వాడే గ్యాస్‌పై పడదని, కేవలం పరిశ్రమలకు అందించే గ్యాస్‌పైనే ఉంటుందని వివరించింది.

Related Posts