ఏపీలో కరోనా బాధితులకు రూ.2వేల సాయం నిలిపివేత, కారణం ఏంటంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలలో ఉండి కోలుకున్న నిరుపేద బాధితులకు ప్రభుత్వం ‘ఆసరా’ కింద రూ..2వేలు ఆర్థిక సాయం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయిదే ఇప్పుడా ఆర్థిక సాయం నిలిచిపోయింది. జులై నుంచి పలుచోట్ల కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని సమాచారం. ప్రభుత్వమే ఈ సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాజిటివ్‌ కేసుల వృద్ధితో ఆర్థికభారం పెరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఈ సాయాన్ని నిలిపేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

పౌష్ఠికాహారం కోసం ప్రతి ఒక్కరికి రూ.2వేల సాయం:
కరోనా వైరస్ సోకినవారు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లిన తర్వాత పౌష్ఠికాహారం తీసుకొనేందుకు వీలుగా ప్రతి ఒక్కరికి రూ.2వేల ఆర్ధికసాయం అందజేస్తామని ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఏప్రిల్‌ నెలాఖరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు మే 4న వైద్యారోగ్య శాఖకు రూ.10 కోట్లు మంజూరు చేశారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ చెల్లింపులు చేపట్టారు. కరోనా నుంచి కోలుకున్న చాలామందికి ఈ సాయం అందింది.

జూలై నుంచి అందని సాయం:
ప్రాథమిక సమాచారం ప్రకారం… మూడు నెలల్లో బాధితులకు రూ.20 కోట్ల వరకు చెల్లించారు. అయితే, జులై నుంచి డిశ్ఛార్జి అయిన వారి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుంటున్నా… నగదు మాత్రం జమ చేయడం లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో క్వారంటైన్‌ కేంద్రాలు తగ్గి, కొవిడ్‌ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్యా పెరిగింది.

భారీగా పెరిగిన కేసులతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం:
దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి కరోనా నుంచి కోలుకున్న వారికి అందజేసే రూ.2వేల ఆర్ధికసాయం నాలుగు రోజుల నుంచి నిలిపివేశామని అనంతపురం జిల్లా కలెక్టర్‌ చెప్పినట్లు అక్కడి సమాచార శాఖ అధికారులు ఇటీవల ప్రకటన జారీ చేశారు. ‘బాధితుల సౌకర్యార్థం ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో నాణ్యత కలిగిన భోజనం పంపిణీ, పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచడం, ఇతర సౌకర్యాల కల్పన కోసం అధిక వ్యయమవుతోంది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు కరోనాతో మరణించిన వారి అంత్యక్రియల కోసం ఇచ్చే సాయం కూడా ఆగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో రాష్ట్ర ఖజానాకు ఆర్ధిక భారం పెరగడంతో.. ఈ సాయాన్ని ఆపేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చెయ్యలేదు.

ఏపీలో వరుసగా 10రోజూ 10వేలకు పైగా కేసులు:
ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా పదోరోజు కూడా పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 69వేల 623 శాంపిల్స్‌ని పరీక్షించగా 10వేల 825 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4లక్షల 87వేల 331కి చేరింది. తాజాగా 71 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 4వేల 347కి చేరింది. 11,941 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది.

నెల్లూరులో 13 మంది, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, విజయనగరంలో ఆరుగురు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, కడపలో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరు చొప్పున మరణించారు. ఇప్పటి వరకు 3లక్షల 82వేల 104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,880 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Related Posts