ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ హైకోర్టు

AP High Court lifts suspension on former Intelligence chief AB Venkateswara Rao

ఆంధ్రప్రదేశ్ సీనియర్ IPS అధికారి, మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ AB వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తేసింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ స‌ర్కార్ ను ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో పెండింగ్‌లో పెట్టిన‌ జీతభత్యాలను కూడా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. క్యాట్ ఇచ్చిన ఆర్డర్‌ను పక్కన పెడుతూ ఆయ‌న‌ సస్పెన్షన్ చెల్లదని సృష్టంచేసింది.

బాధ్యతల గ‌ల ప‌దవిలో ఉండి అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ంటూ ఏబీ వెంకటేశ్వరరావును స్పెండ్ చేస్తూ ఫిబ్రవరిలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీస్ శాఖకు సంబంధించిన నిఘా పరికరాల కొనుగోళ్లలో ఆయ‌న అక్రమాలకు పాల్పడినట్లు అప్ప‌ట్లో అభియోగాలు న‌మోద‌య్యాయి. డీజీపీ ఇచ్చిన రిపోర్ట్ మేర‌కు స‌స్పెండ్ చేసిన‌ట్టు అప్పుడు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

అయితే ప్రభుత్వ  నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వెంకటేశ్వరరావు క్యాట్‌ ను ఆశ్రయంచారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని, ప్ర‌భుత్వ‌మే త‌న‌పై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌రిస్తుంద‌ని ఆయ‌న ఆరోపించారు. అయితే క్యాట్ కూడా ఏపీ స‌ర్కార్ విధించిన సస్పెన్షన్‌ ను సమర్థించింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌ హైకోర్టుకు వెళ్ల‌డంతో విచార‌ణ అనంత‌రం ఇప్పుడు ఆయనకు ఊర‌ట ల‌భించింది. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఫిర్యాదు మేరకు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని తాజా వార్తలు