ఏపీ ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు.. క్లారిటీ ఇచ్చిన ఎండీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీ ఆర్టీసీలో కాంట్రాక్ట్,  ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారని మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఉద్యోగులను ఆందోళనకు గురి చేసింది. అసలే కరోనా సంక్షోభ సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ వివరణ ఇచ్చారు. ఆర్టీసీలో ఏ ఒక్క కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని తొలగించడం లేదన్నారు. మే 22 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో 19మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారని చెప్పారు. కరోనా వల్ల ఆర్టీసీకి రావాల్సిన ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణ దృష్ట్యా అవసరమైన సిబ్బందిని మాత్రమే విధులకు పిలుస్తున్నామని ఆయన చెప్పారు.

ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు అవాస్తవమన్న యాజమాన్యం:
”కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా లాక్‌ డౌన్‌ విధించడంతో కొన్ని సేవలు నిలిపేశాము. ఆయా సేవల్లో ఆర్టీసీలో పని చేస్తున్న శాశ్వత ఉద్యోగులను వినియోగిస్తున్నామే తప్ప ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపు అవాస్తవం. పైగా కరోనా మహమ్మారి సమయంలో ఏదైనా జరిగితే నిబంధనల మేరకు ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏ విధమైన ప్రయోజనాలు ఉండవు. ఆర్థిక ప్రయోజనాలు లేకపోవడం వలనే వారిని విధులకు దూరంగా పెట్టామే తప్ప తొలగించబోము” అని అప్పట్లోనే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

ఆవేదనలో ఉద్యోగులు:
రెండు నెలల కిందట కూడా ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల తొలగింపుపై వివాదం జరిగింది. కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అప్పట్లో సద్దుమణిగిన వివాదం తిరిగి మరోసారి తెరపైకి వచ్చింది. కాంట్రాక్ట్ కాలపరిమితి ముగిసినందున విధులకు రావొద్దంటూ పలు రీజినల్‌, డిపో మేనేజర్లు తమకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వనప్పటికీ విధులు నిర్వహిస్తున్న తమను ఉన్నట్టుండి తొలగించడమేంటని వారు వాపోయారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం గతంలో చెప్పినట్లుగానే ఏ ఒక్కరినీ తొలగిండం లేదంటున్నారు.

7వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు?
కాగా, లాక్ డౌన్ కారణంగా రెండు నెలల పాటు ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ నష్టాల్లో ఉంది. కార్యకలాపాలన్నీ నిలిచిపోయిన తరుణంలో ఉద్యోగులకు యాజమాన్యం భారీ షాక్ ఇచ్చిందని, ఒకేసారి 7వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేసిందని రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. విధులకు హాజరు కావొద్దంటూ సిబ్బందికి డిపో మేనేజర్లు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ ఆదేశాలకు మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ సంస్థ ప్రధాన కార్యాలయం సహా రాష్ట్రంలోని ప్రాంతీయ మేనేజర్ల కార్యాలయాలు, బస్సు డిపోలు, వర్క్ షాపులు, ఆస్పత్రుల్లో దాదాపు 7వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగాలు పోయాయనే వార్త ఉద్యోగులను, వారి కుటుంబాలను ఆవేదనకు గురి చేసింది. కాగా, ఇటీవలే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

రెగులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్:
ఏపీఎస్‌ ఆర్టీసీలోని వివిధ విభాగాల్లో రాష్ట్రవ్యాప్తంగా 7వేల మంది పని చేస్తున్నారు. కొన్నేళ్లుగా వీరు ఆర్టీసీ సంస్థనే నమ్ముకొని ఉంటున్నారు. గత జనవరిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసింది. దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ చేస్తున్న డిమాండ్‌ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నెరవేర్చింది.  రాష్ట్ర రవాణా శాఖలో ప్రజా రవాణా శాఖ(పీటీడీ)ని ఏర్పాటు చేసి 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేశారు. అప్పటి వరకు ఔటు సోర్సింగ్‌, కాంట్రాక్టు విధానంలో ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులు తమకు సైతం ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కోరడం ప్రారంభించారు.

Read: నాకు ప్రాణహాని ఉంది, కేంద్ర బలగాలతో భద్రత కల్పించండి..

Related Posts