ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతిచ్చే అధికారం అపెక్స్‌దే.. తేల్చి చెప్పిన కేంద్ర జలశక్తి మంత్రి.. పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, కృష్ణా రివర్ బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

apex council: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు‌. తొలిసారి రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై పూర్తి స్థాయిలో చర్చించామన్నారు. కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకరించారన్నారు. ట్రిబ్యునల్ ద్వారా నీటి కేటాయింపులు జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారన్నారు. జల పంపిణీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని కేసీఆర్ తెలిపారన్నారు. కేసు వెనక్కి తీసుకున్నాక న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తామన్నారు షెకావత్‌.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై కొత్త నిర్మాణాలకు అనుమతిచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు మాత్రమే ఉంది:
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పూర్తిగా చర్చించామని, చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఒక పరిష్కారానికి వచ్చామని గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. మంగళవారం(అక్టోబర్ 6,2020) జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదులపై ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా వాటికి అనుమతులు ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌దేనని షెకావత్‌ స్పష్టం చేశారు.

ప్రాజెక్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేస్తామన్నారు. కొత్త ప్రాజెక్టులపై చర్చ జరగ లేదన్నారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. అటు కృష్ణా రివర్‌ బోర్డ్‌ కార్యాలయాన్ని ఏపీకి తరలించేందుకు తెలంగాణ సీఎం అంగీకరించారని తెలిపారు షెకావత్‌. అలాగే ఏడాదికి ఒకసారైనా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాలన్నారు.

కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు అంగీకారం:
‘కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల పరిధిని నోటిఫై చేయడంపై చర్చ జరిగింది. ఆరేళ్లుగా వివాదాల కారణంగా వీటిని నోటిఫై చేయలేదు. ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల ఏకాభిప్రాయంతో వీటిని నోటిఫై చేస్తున్నాం. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించిన కొత్త ప్రాజెక్ట్‌లపై డీపీఆర్‌లను సమర్పించడానికి ఇరు రాష్ట్రాల సీఎంలు ఒప్పుకున్నారు’’ అని షెకావత్‌ వెల్లడించారు. కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డులకు ముందుగా డీపీఆర్‌లను సమర్పించిన తర్వాతనే కొత్త ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలు తేవాలని చర్చించామని ఆయన తెలిపారు.

కృష్ణా రివర్‌ బోర్డ్‌ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి:
కృష్ణా, గోదావరి జలాల పంపిణీకి సంబంధించి సమగ్రమైన ప్రణాళికపై చర్చ జరిగిందని, కృష్ణా రివర్‌ బోర్డ్‌ను హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలించేందుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నాయని చెప్పారు. త్వరలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తామని మంత్రి చెప్పారు.

విభజన చట్టం ప్రకారమే అపెక్స్ కౌన్సిల్ ఏర్పడింది:
రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి పరిధిలోని సమస్యలపై చర్చించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో విభజన చట్టం ప్రకారం అపెక్స్ కౌన్సిల్ ఏర్పడిందన్న షెకావత్.. చట్టం ప్రకారం కృష్ణా నదీ జలాల బోర్డు ఏర్పాటైందని అన్నారు. ఇవాళ జరిగిన సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించామని తెలిపారు. సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి వాదనలు వారు వినిపించారని అన్నారు.

నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై చట్ట ప్రకారమే ముందుకెళ్తామని కేంద్ర మంత్రి తెలిపారు. చాలా అంశాలపై ఏకాభిప్రాయంతో ఓ పరిష్కారానికి వచ్చామన్నారు. విభజన చట్టం ప్రకారం అన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని కేంద్రమంత్రి వెల్లడించారు.

Related Tags :

Related Posts :