రాజీ ఫార్ములా వర్కౌట్ అయింది : విశ్వాస పరీక్షలో గహ్లోత్‌ గెలుపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజస్తాన్‌ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విజయం సాధించింది. పాలక కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్‌ సర్కార్‌ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్‌ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ ప్రకటించారు.

తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ పార్టీ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. తాను కాంగ్రెస్‌ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్‌ పైలట్‌ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు.

అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్‌ గహ్లోత్‌ మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్‌ ఆరోపించారు. రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయపార్టీ భంగపడిందని అన్నారు.

కాగా, ఇవాళ ఉదయం అసెంబ్లీలో తనకు కేటాయించిన సీటుపై సచిన్ పైలట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రతిపక్షాలకు సమీపంలో సీటు కేటాయించడంపై పైలట్… తనదైన శైలిలో స్పందించారు. తనకు బోర్డర్‌లో సీటు కేటాయించడం, విపక్షాల పక్కనే తాను కూర్చుండటం అందరిలో ఆసక్తి రేపుతోందని అన్నారు. బలమైన యోధుడు సరిహద్దుకు పంపబడ్డడని పైలట్ అన్నారు. సరిహద్దుల్లో అత్యంత శక్తివంతమైన సైనికుడినే మోహరిస్తారు కాబట్టే తనకు అక్కడ సీటు కేటాయించారని పైలట్‌ వ్యాఖ్యానించారు.

 

Related Posts