-
Home » ఊహించని పరిణామం, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ హఠాత్తుగా నిలిపివేత
Big Story
ఊహించని పరిణామం, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ హఠాత్తుగా నిలిపివేత
Published
4 months agoon
By
naveen
ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ పై చాలా నమ్మకాలు ఉన్నాయి. అంతా ఈ టీకాను విశ్వసిస్తున్నారు. అయితే ట్రయల్స్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ చివరి దశ ప్రయోగాలను హఠాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది. దీనికి కారణం బ్రిటన్‌లో జరుగుతున్న టీకా ప్రయోగాలలో వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లకు తీవ్రమైన అస్వస్థత ఏర్పడటమే. దీంతో వెంటనే పరీక్షలను తాత్కాలికంగా ఆపేశారు.
టీకా తీసుకున్న వలంటీర్ కు అస్వస్థత:
ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా దీనిపై స్పందించింది. స్వచ్చందంగానే ట్రయల్స్ నిలిపివేసినట్టు ప్రకటించింది. టీకా తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడని తెలిపింది. దీంతో పలు దేశాల్లో ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. అయితే ఇలాంటి చిన్నచిన్న సమస్యలు వస్తూనే ఉంటాయని, అలాంటి సందర్భాలలో పరీక్షలు నిలిపేయడం సహజమేనని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తి స్థాయి సమీక్ష కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా తయారు చేస్తున్న ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న దాదాపు డజనుకుపైగా వ్యాక్సిన్లలో ఆస్ట్రా జెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ అన్నింటిలో ప్రభావవంతమైంది అన్న అంచనాలున్నాయి.
30వేల మందిపై మూడో దశ ట్రయల్స్:
ఇప్పటికే రెండు దశల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్, మిగతావాటికంటే ముందుగా మార్కెట్లోకి రావడానికి అవకాశముందని అంతా భావిస్తున్నారు. యూకే, బ్రెజిల్, అమెరికా, దక్షిణాఫ్రికాలలో కలిపి దాదాపు 30వేల మందిపై మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. సాధారణంగా వ్యాక్సిన్ల మూడోదశ ట్రయల్స్ వేలమందిపై నిర్వహించాల్సి ఉంటుంది. ఇవి పూర్తి కావడానికి ఏళ్లు కూడా పట్టొచ్చు.
అసలేం జరిగింది?
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ట్రయల్స్‌ను నిలిపేశారని, భద్రతా ప్రమాణాలను స్వతంత్ర సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని, పరిస్థితులను బట్టే ట్రయల్స్ ముందుకు సాగుతాయని నిపుణులు తెలిపారు. “పెద్ద ఎత్తున జరిగే ట్రయల్స్‌లో కొందరికి అనారోగ్యం ఏర్పడటం సహజమే. కానీ ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం’’ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ఇలా నిలిపేయాల్సి రావడం ఇది రెండోసారి. ఎందుకు అనారోగ్యం ఏర్పడిందో వెంటనే చెప్పలేకపోయినా, ఇలాంటి టెస్టుల్లో వాలంటీర్లు అనారోగ్యం పాలుకావడం సహజమేనని చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో ట్రయల్స్ యథావిధిగా కొనసాగుతాయని భావిస్తున్నారు.
అనారోగ్యం బారిన పడటానికి కారణం ఏంటో చెప్పలేదు:
వలంటీర్లు తీవ్ర అనారోగ్యం పాలయ్యారన్న విషయాన్ని తొలిసారి బయటపెట్టిన స్టాట్‌న్యూస్ అనే హెల్త్ వెబ్సైట్, వారికి కలిగిన అనారోగ్యం వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే వలంటీర్లు త్వరగానే కోలుకుంటారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వర్గాలు పేర్కొన్నట్లు ఆ వెబ్సైట్ వెల్లడించింది. మరో రెండు కంపెనీలు మోడెర్నా, జర్మనీకి చెందిన బయోఎన్ టెక్ ఫైజర్ సైతం వ్యాక్సిన్ చివరి దశ ట్రయల్స్ లో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఈ రెండు టీకాలు భిన్నంగా పని చేస్తున్నాయి.
నవంబర్ 1 కల్లా అందుబాటులోకి వ్యాక్సిన్ అన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఆందోళన:
కాగా, కరోనా వ్యాక్సిన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల తేదీ నవంబర్ 3 కంటే రెండు రోజుల ముందుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తాను భావిస్తున్నానని చెప్పారు. అంతేకాదు నవంబర్ 1 నుంచి వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆయన ప్రకటన, వ్యాక్సిన్ రేసులో రాజకీయాల కారణంగా ప్రజల భద్రతను ప్రమాదంలో పడేసే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రంప్ ప్రత్యర్ధి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్ సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను వినాలని, వ్యాక్సిన్ తయారీలో పారదర్శకత ఉండేలా చూడాలని ట్రంప్‌కు సూచించారు.
నైతిక, శాస్త్రీయ ప్రమాణాలను పాటిస్తామని 9 కంపెనీలు ప్రతిజ్ఞ:
ఇది ఇలా ఉంటే, వ్యాక్సిన్ తయారీ విషయంలో అన్ని రకాల నైతిక, శాస్త్రీయ ప్రమాణాలను పాటిస్తామని టీకాలను తయారు చేస్తున్న 9 కంపెనీలు మంగళవారం(సెప్టెంబర్ 8,2020) ప్రతిజ్జ చేశాయి. ఈ ప్రతిజ్జ చేసిన తొమ్మిది కంపెనీలలో ఆస్ట్రాజెనెకా కూడా ఉంది. మూడు దశల ట్రయల్స్ పూర్తయ్యాక అనుమతి కోసం రెగ్యులేటరీ అథారిటీకి పంపిస్తామని ఈ ప్రతిజ్ఞలో కంపెనీలు తెలిపాయి. జాన్సన్ అండ్ జాన్సన్, బయోఎన్-టెక్, గ్లాక్సో స్మిత్‌క్లైన్, ఫైజర్, మెర్క్, మోడెర్నా, సనోఫీ, నోవావ్యాక్స్ ఈ ప్రతిజ్జ చేసిన మిగిలిన కంపెనీలు. ట్రయల్స్‌లో పాల్గొంటున్నవారి ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఈ కంపెనీలు స్పష్టం చేశాయి.
భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ట్రయల్స్ పూర్తి చేస్తామని భావించడం లేదు:
ఇప్పటి వరకు 180మంది టెస్టింగ్ వాలంటీర్లను పరిశీలించామని, వారిలో ఇంకా ఎవరిపైనా క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. ఈ ఏడాదిలో ఈ వ్యాక్సిన్లన్నీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ట్రయల్స్ పూర్తి చేస్తాయని తాము భావించడం లేదని WHO అంది. ఇవన్నీ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది.

సువెందు శపథం : మమతని 50వేల ఓట్ల తేడాతో ఓడించకపోతే పాలిటిక్స్ వదిలేస్తా

బ్రిస్బేన్ టెస్ట్ : టీమిండియా ఎదుట టఫ్ టార్గెట్

టచ్ చేసి చూడు అంటూ కొడాలి నానికి దేవినేని ఉమ సవాల్

కాళేశ్వరానికి సీఎం కేసీఆర్, ఢిల్లీకి సీఎం జగన్
