సింగం స్టైల్ వద్దు…యువ IPSలతో మోడీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం జరిగిన ‘దీక్షాంత్  పరేడ్ ఈవెంట్’ లో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ప్రొబిషినరీ పిరియడ్‌లో ఉన్న ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.  ప్రతి సంవత్సరం తాను శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులతో ముఖాముఖి కలుసుకుంటానని, కరోనా వ్యాప్తి చెందుతోన్నందు వల్ల ఈ సారి తాను ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నానని మోడీ అన్నారు. తన పదవీ కాలంలో తప్పకుండా కలుసుకుంటానని భరోసా ఇచ్చారు.

ఐపీఎస్ ‌లను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ… మీ వృత్తిలో ఊహించని అనేక ఘటనలు జరుగుతాయి. చాలా హింసను ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటప్పుడు మీకు ఇష్టమైనవారితో, మంచి సలహాలు ఇచ్చే వారితో మాట్లాడండి. ఒత్తిడిలో పనిచేసేవారందరికి యోగా, ప్రాణాయామం మంచిది. ఇలా చేస్తే ఎంత పని ఉన్నా మీరు ఒ‍త్తిడికి గురికారు అని తెలిపారు.

ఐపిఎస్ అధికారులు “సింగం” లా ఉండకుండా ఉండాలని, అసలు పనిని విస్మరించకుండా చూసుకోవాలని ప్రధాని కోరారు. ప్రజలతో సన్నిహితంగా మెలగాలని వారికీ మోడీ సూచించారు. ప్రజలతో సన్నిహితంగా మెలిగినప్పుడే సుదీర్ఘకాలం వారు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆ పేరు ప్రఖ్యాతులు నిలిచిపోతాయని చెప్పారు. ఫ్రెండ్లీ పోలిసింగ్‌కు ఆద్యులు కావాలని అకాంక్షించారు

తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తోన్న సమయంలో కొందరు యువ ఐపీఎస్ అధికారులు తనను కలుసుకునే వారని, వారి కళ్లల్లో దేశం పట్ల బాధ్యతను, చిత్తశుద్ధనీ చూశానని అన్నారు. తొలిసారిగా తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో కొందరు ఐపీఎస్ అధికారులు చూపిన చొరవను తాను ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నానని చెప్పారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, కానిస్టేబుల్ స్థాయిలో కూడా నిఘా బలోపేతం కావాలని అన్నారు. దురదృష్టశావత్తు ఇప్పుడా పరిస్థితులు లేవని అన్నారు.

ప్రతి ఒక్కరు వారి ఉద్యోగాన్ని, వారి యూనిఫామ్‌ను గౌరవించాలని మోడీ కోరారు. కరోనా కారణంగా పోలీసులు చేస్తున్న మంచి పనులు వారు ఎప్పుడూ ప్రజల మనస్సులలో చిరస్మరణీయంగా మిగిలేలా చేశాయి అని ప్రధాని కొనియాడారు.

కాగా,నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో 131మంది ఐపీఎస్‌లు శిక్ష‌ణ పొందారు. వీరిలో 28 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. 42 వారాల పాటు శిక్ష‌ణ పూర్తిచేసుకున్న వీరిని ప‌లు కేడ‌ర్ల‌కు నియ‌మించారు. తెలంగాణ‌కు 11మంది, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఐదుగురు ఐపీఎస్‌లను కేటాయించారు

Related Posts