పవిత్రమైన బక్రీద్.. త్యాగానికి ప్రతీక.. ముస్లింల పండుగ రోజు!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముస్లింల ప్రధాన పండగలు రెండు ఒకటి రంజాన్.. రెండవది బక్రీద్. బక్రీద్ అని పిలువబడే ఈద్-ఉల్-అజా ముస్లిం సమాజంలో ఒక ముఖ్యమైన పండుగ. ప్రపంచం నలుమూలల ముస్లిం సమాజాలు ఈద్-ఉల్-అజాకు త్యాగం పండుగను జరుపుకుంటాయి. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, బక్రీద్ లేదా ఈద్-ఉల్-జుహాను 12వ నెల 10వ తేదీన జరుపుకుంటారు. రంజాన్ నెల ముగిసిన 70 రోజుల తరువాత బక్రీద్ జరుపుకుంటారు.ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ఈ మాసం ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు. ఇస్లామిక్ విశ్వాసాల ప్రకారం, ముస్లింలకు దిశానిర్దేశం చేసేందుకు అల్లాహ్‌ పంపిన ప్రవక్తల్లో ఒకరైన హజరత్‌ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే పండగ బక్రీద్‌. హజరత్‌ ఇబ్రహీం తన కుమారుడు హజరత్‌ ఇస్మాయిల్‌ను దేవుని ఆదేశాల మేరకు ఈ రోజు దేవుని మార్గంలో బలి ఇచ్చేందుకు సిద్ధం అవుతాడు.

ప్రవక్త హజరత్‌ ఇబ్రహీం, ఆయన భార్య హజీరాలకు 90ఏళ్ల వయస్సులో సంతానప్రాప్తి కలిగింది. లేక లేక పుట్టిన కొడుకు ఇస్మాయిల్‌ను అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగా కొడకు ఇస్మాయిల్‌ను అల్లాహ్‌పేర బలిదానం చేస్తున్నట్లు కలగంటారు. దీంతో అల్లాహ్‌ తన కుమారుడిని బలిదానం కోరుకుంటున్నారని గ్రహించిన ఇబ్రహీం తన కుమారుడు ఇస్మాయిల్‌ను బలిదానం(ఖుర్బానీ) ఇచ్చేందుకు సిద్ధపడతారు. తండ్రి అంతరంగాన్ని గమనించిన కుమారుడు ఇస్మాయిల్‌ కూడా అల్లాహ్‌ మార్గంలో బలయ్యేందుకు సిద్ధపడుతాడు.బలిచ్చే సమయంలో పుత్రవాత్సల్యం అడ్డువస్తే. తనకు బలి ఇవ్వకుండా తన తండ్రి వెనకడుగు వేస్తే, అల్లాహ్‌తో విశ్వాసఘాతకుడిగా నిలవకుండా, కళ్లకు గంతలతో తనను బలి ఇవ్వమంటూ తండ్రికి సూచిస్తారు. ఆ మేరకు అల్లాహ్‌ నామస్మరణతో తన కుమారుడిని బలి ఇచ్చేందుకు గొంతుపై కత్తిపెట్టిన క్షణంలో త్యాగ నిరతికి మెచ్చిన అల్లాహ్‌ ఆఖరు క్షణంలో ఇస్మాయిల్‌ను తప్పించి అదే స్థానంలో ఒక దుంబా (పొట్టేలు) ను పెడతారు. దీంతో పొట్టేలు గొంతు తెగి అల్లాహ్‌ మార్గంలో అది ఖుర్బాన్‌ అవుతుంది. ఇబ్రహీం త్యాగనిరతిని మెచ్చిన అల్లాహ్‌ ఆరోజు నుంచి ఈదుల్ అజ్ హా (బక్రీద్‌) పండగ రోజు జంతు బలి ఇవ్వాలనీ, ఈ విధానాన్ని ప్రళయం వరకు కొనసాగించాలని నిర్దేశించినట్లు ఇస్లాంలో చెబుతారు.

ఖుర్బానీ మాంసం మూడు భాగాలుగా విభజించబడింది. ఒక భాగం పేదల కోసం, రెండవది బంధువుల కోసం మరియు మూడవ భాగం తమ కోసం.


Related Posts