లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

బాలాకోట్ దాడి సమాచారాన్ని మోడీనే అర్నాబ్ గోస్వామికి లీక్ చేశారు..చైనా చొరబాటుపై మిస్టర్ 56 మాట్లాడరేం?

Published

on

RAHUL GANDHI ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బాలాకోట్​లోని పాక్​ ఉగ్రవాద శిబిరాలపై 2019లో భారత వాయుసేన దాడి సమాచారాన్ని మోడీనే రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామికి లీక్​ చేశారని రాహుల్​ ఆరోపించారు. అందుకే.. ఆ దాడి సమాచారం మూడు రోజుల ముందుగానే రిపబ్లిక్​ ఛానెల్​లో​ ప్రసారమైందని అన్నారు. బాలాకోట్​ దాడి సమాచారాన్ని ముందే లీక్​ చేసి.. వైమానిక దళ సిబ్బంది ప్రాణాలను మోడీ ప్రమాదంలోకి నెట్టారని రాహుల్​ ఆరోపించారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో తన చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్​​ మాట్లాడుతూ..బాలాకోట్ మెరుపుదాడుల గురించి 5గురు వ్యక్తులు.. ప్రధాని,రక్షణమంత్రి,జాతీయ భద్రతా సలహాదారు,హోంమంత్రి,చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కి మాత్రమే ముందుగా తెలిసుండాలి. ఈ ఐదుగురికే బాలాకోట్​లో జరిగే దాడి గురించి తెలుసు. ప్రపంచంలో మిగతా ఎవ్వరికీ ఈ విషయం గురించి తెలియదు. అయితే,బాలాకోట్​ దాడి గురించి మూడు రోజుల ముందే ఓ భారత జర్నలిస్టుకు తెలిసింది. ఈ ఐదుగురిలో ఒకరు ఆ సమాచారాన్ని సదరు జర్నలిస్టుకు చేరవేశారు.

ప్రధాని మోడీనే ఆ పని చేశారు కాబట్టి, దీని గురించి విచారణ జరపలేదు. ప్రధాని ఈ దాడి సమాచారాన్ని లీక్​ చేయలేదనేది నిజమే అయితే.. వెంటనే ఈ విషయంలో దర్యాప్తు జరిపించాలని రాహుల్​ డిమాండ్​ చేశారు. అయితే.. రాహుల్​ తన వ్యాఖ్యలపై ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) కూడా దీనిపై స్పందించలేదు.

మరోవైపు, భారత భూభాగంలోకి చైనా చొరబడుతున్నా ప్రధాని మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. తనకు 56 అంగుళాల ఛాతి ఉందని చెప్పిన మోడీ.. భారత భూగంలోకి చైనా దళాలు ప్రవేశిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్​ ఈ ఎన్నికల ప్రచారంలో నిలదీశారు. ప్రధానికి చైనా అనే పదాన్ని పలికే ధైర్యం కూడా లేదని విమర్శించారు. గత వారం సిక్కింలోని నకులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారని, వారిని భారత బలగాలు అడ్డుకునే ప్రయత్నంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని పలువురు భారత సైనికులు గాయపడ్డారని వార్తలు వచ్చిన నేపథ్యంలో రాహుల్ తాజాగా స్పందించారు.

చైనా చొరబాట్లపై రాహుల్ సోమవారం చేసిన ట్వీట్ లో..భారత భూభాగంలో చైనా విస్తరణ కొనసాగుతోంది. మిస్టర్ 56 మాత్రం నెలల తరబడి చైనాపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు’ అని మోదీని తప్పుపట్టారు. ఆదివారంనాడు కూడా రాహుల్ చైనా చొరబాట్లపై కేంద్రాన్ని విమర్శించారు. భారత కార్మికులు, రైతులు, నేత కార్మికులు బలంగా ఉంటే, వారిని పరిక్షించి, అవకాశాలు కల్పిస్తే చైనా ఎప్పటికీ భారత వైపు కన్నెత్తి చూసే సాహసం చేసేది కాదని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందనే విషయం, దేశంలోని ఐదారుగురు వ్యాపారవేత్తలకు అనుకూలంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందనే విషయం చైనాకు బాగా తెలుసునని అన్నారు.