నష్టాల్లో బ్యాంకులు, ఆయిల్ కంపెనీలు.. తీవ్ర ఆహార సంక్షోభం.. చైనాలో దుర్భర పరిస్థితులు, తక్కువ తినాలని దేశ ప్రజలకు పిలుపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. చైనాలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. చాలామంది తిండి దొరక్క అల్లాడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ‘కామ్రేడ్స్‌.. తక్కువ తినండి’ అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్‌ ”క్లీన్‌ యువర్ ప్లేట్” పేరిట ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు.

1962లో మావో జెడాంగ్‌ కూడా:
1962లో దేశాన్ని పారిశ్రామికంగా వృద్ధి చేయడానికి నాటి చైనా అధినేత మావో జెడాంగ్‌ ‘గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌’ ఉద్యమానికి పిలుపునిచ్చారు. పంటలపై ప్రోత్సాహాకాలను తగ్గించారు. దీంతో దిగుబడులు తగ్గి ఆహారం దొరక్క కోట్లాది మంది చనిపోయారు. ఆకలి చావుల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికి అప్పుడు మావో సరిహద్దు వివాదాలను అస్త్రంగా ఎంచుకొన్నారు. 1962లో భారత్‌తో కయ్యానికి దిగారు. ఇప్పుడు జిన్‌పింగ్‌ అదే తరహాలో భారత్‌తో సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలను పెంచుతున్నారు.

ప్రజల దృష్టి మరల్చడానికి కయ్యాలు:
ఆహార కొరత సమయంలోనే చైనా భారత్‌ సహా తన చుట్టూ ఉన్న దేశాలతో గిల్లి కయ్యం పెట్టుకుంటోంది. కయ్యం పెట్టుకోవడం చైనా సహజ స్వభావం అని ఇప్పటిదాకా చాలామంది భావిస్తూ వచ్చారు. కానీ ఈ కయ్యాలకు, చైనాలో ఆహార కొరతకు సంబంధం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆహార కొరత నుంచి సొంత ప్రజలు, ప్రపంచ దేశాల దృష్టిని మరల్చడానికే చైనా ఒక పద్ధతి ప్రకారం సరిహద్దుల దగ్గర గొడవలకు దిగుతోందని చెబుతున్నారు.

అమెరికాతో ట్రేడ్ వార్, వరదలు కారణం:
చైనాలో ఆహార సంక్షోభానికి అమెరికాతో వాణిజ్య యుద్ధం మొదటి కారణమైతే, తర్వాత కరోనా, వరదలు కారణమయ్యాయి. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల ఎగుమతుల్లో రారాజుగా ఉన్న చైనా ఆహార రంగంలో మాత్రం 30శాతం దిగుమతుల మీదనే ఆధారపడుతోంది. కరోనా వల్ల దిగుమతులు ఆగిపోయాయి. దీనికి తోడు ఈ ఏడాది యాంగ్జీ నది వరదలతో పోటెత్తింది. పంటలు బాగా దెబ్బతిన్నాయి. అంటే రానున్నకాలంలో కూడా పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఆహార కొరత ఇంకొంత కాలం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని తీర్చలేని ప్రభుత్వం తక్కువ తినాలని ప్రజలకు చెబుతోంది.

తక్కువ తినండి, ఆహారం వృథా చేయొద్దు, ఖర్చులు తగ్గించుకోండి:
ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2013 నాటి ”క్లీన్ యువర్ ప్లేట్” కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ”ఆహార వృథా విపరీతంగా ఉంది. ఈ గణాంకాలు విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి”అని అధికారులకు జిన్‌పింగ్ సూచించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఆహార వృథాను సిగ్గుచేటుగా ప్రజలు భావించేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు

”కొన్నేళ్లకు సరిపడ ఆహార ధాన్యాలను చైనా ఇప్పటికే ఉత్పత్తి చేసింది. అయితే ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన ఉండాలి” అని జిన్‌పింగ్ చెప్పినట్లు ద చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ తెలిపింది. జిన్‌పింగ్ ప్రకటన విడుదలైన వెంటనే.. ఆహారాన్ని ఎవరూ వృథా చేయకూడదంటూ అన్ని మీడియాల్లోనూ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. 2015లో చైనాలోని మహా నగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపిస్తున్నారు.

బ్యాంకులు, ఆయిల్ కంపెనీల పరిస్థితి దారుణం:
ఇది ఇలా ఉంటే చైనాలోని బ్యాంకుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆయిల్ కంపెనీల పరిస్థితి కూడా అంతే. చైనాలోని 5 అతిపెద్ద బ్యాంకులు ఇటీవల తమ లాభాల నివేదికను ప్రకటించాయి. వాటి లాభాల్లో భారీ క్షీణత నమోదైంది. గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా లాభాలు తగ్గాయి. దాదాపు 10శాతం మేర ప్రాఫిట్ తగ్గింది.

నష్టాల్లో చైనాలోని 5 అతిపెద్ద బ్యాంకులు:
Industrial and Commercial Bank of China
China Construction Bank
Agricultural Bank of China
Bank of China
Bank of Communications

భారీగా నష్టాలు చూసిన బ్యాంకులు:
ఈ బ్యాంకులన్నీ గత వారం తమ ఫలితాలను వెల్లడించాయి. అవన్నీ కూడా లాభాల్లో బిలియన్ డాలర్లను కోల్పోయాయి. దీనికి కారణం చైనా ప్రభుత్వమే. బ్యాంకులు ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ప్రభుత్వం చెప్పినట్టుగానే నడుచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలోని డబ్బు పంపేందుకు ఈ 5 బ్యాంకులను వాడుకుంటున్నారు. ఇటీవలే 219 బిలియన్ డాలర్లను త్యాగం చేయాలని ఆర్థిక సంస్థలను ప్రభుత్వం కోరింది. అంతేకాదు తక్కువ వడ్డీ రేట్లకు లోన్లు ఇవ్వాలని బ్యాంకులపై ఒత్తిడి తెచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు చైనా ప్రభుత్వం బ్యాంకులను పణంగా పెడుతోంది. దాదాపు 480 బిలియన్ డాలర్లు లోన్లుగా ఇచ్చాయి బ్యాంకులు. ఈ కారణంగానే బ్యాంకులు లాభాలు గణనీయంగా తగ్గాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా లాస్‌లో ఆయిల్ కంపెనీలు:
ఒక బ్యాంకులే కాదు ఆయిల్ కంపెనీలు సైతం తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటున్నాయి. చైనాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ, ఆసియాలోనే అతిపెద్ద రిఫైన్ సైనోపెక్ 3.2 బిలియన్ డాలర్లు నష్టపోయింది. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఆ కంపెనీ లాస్ చూడలేదు. పెట్రో చైనా చైనాలో మరో అతిపెద్ద అయిడ్ ప్రొడ్యూసర్. ఆ కంపెనీ 29.8 బిలియన్ యన్ ల నష్టాన్ని మూటకట్టుకుంది.

చైనాలో ఆహార సంక్షోభం, రెస్టారెంట్స్ లో కొత్త రూల్:
ఈ కష్టాలన్నీ.. చైనాలో మరో సంక్షోభానికి దారితీశాయి. అదే ఆహార సంక్షోభం. చైనాలో ఆహార నిల్వలు శర వేగంగా తగ్గిపోతున్నాయి. అప్రమత్తమైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. కామ్రేడ్స్ తక్కువ తినండి, ఆహారాన్ని వృథా చేయకండి అని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో రెస్టారెంట్స్ లో కొత్త రూల్ పెట్టారు. నలుగురు వ్యక్తులు ముగ్గురికి సరిపడ ఆహారం మాత్రమే ఆర్డర్ చేయాలి. స్పెషల్ ఫుడ్ ఏదీ కొనకూడదు. దేశ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు చైనాలో భయాందోళనలు రేకెత్తించింది.

ఆహార సంక్షోభం నెలకొందన్న వార్తలతో ప్రజల్లో అప్పుడే టెన్షన్ మొదలైంది. చాలామంది రైతులు తమ పంటలను నిల్వ చేసుకుంటున్నారు. ఈ సీజన్ లో ఆహార ధాన్యాల సరఫరాలో కొరత ఉంటుందనే భయంతో ముందు జాగ్రత్తగా తమ పంటలను నిల్వ చేసుకుంటున్నారు. ధరలు పెరుగుతాయనే ఆందోళనతో ఇప్పటి నుంచే తమ పంటలను నిల్వ చేసుకుంటున్నామని రైతులు చెబుతున్నారు.

Related Posts