బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి చందమామ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bathukamma 2020  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలోనే మహిళల కష్ట సుఖాలు దాగి ఉంటాయి. ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు అన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే తీరొక్క పూలను అందంగా పేరుస్తూ.. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారుఇక్కడి ఆడపడుచులు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు.. 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ పండుగలోనే ఉంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ వినసొంపైన పాటలతో మహిళలు ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతారు. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. వాటిని అందంగా అలంకరించి..బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు.

బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన పండుగ ఈనెల 24 వరకు జరుగుతుంది.

ఈ సంబరాలు జరుపుకునే మహిళలు మట్టితో చేసే దుర్గాదేవి బొమ్మను బొడ్డెమ్మగా భావిస్తూ బతుకమ్మతో పాటు చేసి నిమజ్జనం చేస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ నైవేద్యాలు తొమ్మిది రోజులపాటు ప్రతిరోజూ ఓక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొలిరోజు బతుకమ్మను పేర్చడానికి వాడే పూలను ఒకరోజు ముందే తీసుకొస్తారు. పువ్వులు వాడిపోకుండా నీళ్లలో వేసి మరుసటిరోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు.బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. శివుడు లేని పార్వతి గురించి పాటలుగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు తెలంగాణ పడుచులు. బతుకమ్మ పండుగ ..ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. పూలు బాగా వికసించే కాలంలో జలవనరులు సమృద్ధిగా పొంగి పొర్లే సమయంలో ..భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగను సంబరంగా జరుపుకుంటారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ సమస్య, వివాదాలు లేకుండా రాష్ట్ర పండుగగా బతుకమ్మకు గుర్తింపు ఇచ్చింది ప్రభుత్వం. బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మహిళలు జాగ్రత్తగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని ..మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ పండుగ సంబురాలు జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది

Related Posts