వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర మహా యాగం

హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో డిసెంబర్ 15 నుంచి 21 వ తేదీ వరకు పంచాయతన చతుర్వేదనహిత శతచండీ అతిరుద్ర యాగం నిర్వహించనున్నారు.

  • Published By: veegamteam ,Published On : November 15, 2019 / 03:42 AM IST
వేయిస్తంభాల ఆలయంలో అతిరుద్ర మహా యాగం

హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో డిసెంబర్ 15 నుంచి 21 వ తేదీ వరకు పంచాయతన చతుర్వేదనహిత శతచండీ అతిరుద్ర యాగం నిర్వహించనున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో లోక కళ్యాణార్థం డిసెంబర్ 15 నుంచి 21 వ తేదీ వరకు పంచాయతన చతుర్వేదనహిత శతచండీ అతిరుద్ర యాగం నిర్వహించనున్నారు. శృంగేరీ శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహా ప్రస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం 37వ పీఠాధిపతి శ్రీ విధు లేఖర భారతీస్వామీజీ పర్యవేక్షణలో ఈ యాగం జరుగనుంది. ఈ యాగ విశేషాలను తెలియజేసేందుకు గురువారం (నవంబర్ 14, 2019) ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌ భాస్కర్‌, నగర మేయర్‌ గుండా ప్రకా్‌షరావు ఆహ్వాన పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ యాగానికి ఏర్పాట్లు చేస్తన్నామని తెలిపారు. లోక కళ్యాణార్థం, సమాజ శ్రేయస్సు కోసం నగరంలో ప్రప్రథమంగా అతిరుద్రయాగం నిర్వహించడం శుభ సూచకమన్నారు. ప్రభుత్వంతోపాటు కుడా నగర పాలక సంస్థ సహకారాన్ని అందచేసి యాగాన్ని విజయవంతం చేయడంలో తాము కృషిచేస్తామన్నారు. 

ధర్మ ప్రచార పరిషత్‌ అధ్యక్షుడు భవితశ్రీ చిట్‌ఫండ్‌ ఎండి తా టిపెల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహా యాగానికి భక్తులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రుద్రేశ్వరుడి సన్నిధిలో రుద్రపారాయణాలు, అభిషేకాలు, హోమాలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శైవ, వైష్ణవ సంప్రదాయాల్లో శివ కేశవులను ఆరాధిస్తూ సమాజంలో ఆధ్యాతిక చింతన పెంపొందింప చేసేందుకు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు. యాగంతోపాటు లక్ష్మీనారాయణ హృదయ హోమాన్ని, సుదర్శన మహాయాగాన్ని , చతుర్వేద యాగాలను కూడా నిర్వహింపచేస్తామన్నారు.

ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యాగంలో పాల్గొని ప్రతీఒక్కరు యాగ ఫలాలను పొందాలని సనాతన ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా ఆహ్వానించారు. వేయిస్తంభాల ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ మోక్ష సాధనకై ఆచరించే యాగాల ఫలితాలను నగర వాసులు పొందనుండటం చాలా విశేషమన్నారు.