మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు.. మరి రాముడు దేవుడెలా అయ్యాడు

మనిషిగానే పుట్టాడు, మనిషిగానే కష్టసుఖాలు అనుభవించాడు.. మరి రాముడు దేవుడెలా అయ్యాడు

How Rama Become Lord Rama

రాముడు.. దేవుడనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.. రాముడు ఒక మనిషి. మనిషిగానే పుట్టాడు.. మనిషిగానే పెరిగాడు.. మనిషిగానే కష్ట సుఖాలన్నీ అనుభవించాడు. రాజుగా.. ప్రజల్ని పరిపాలించాడు. మరి.. మనందరికీ ఆదర్శప్రాయుడు ఎలా అయ్యాడు? పురుషోత్తముడిగా ఎలా మారాడు?

శ్రీరాముని జీవితం మొత్తం.. మానవులకు ఎన్నో విషయాలను నేర్పుతుంది. ఎప్పుడెలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టినవాళ్లతో ఎల మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత.. అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు.. ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలో తెలియజేస్తుంది. కులం, మతం లాంటి సామాజిక అడ్డుకట్టల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువతో పాటు శత్రువుతో కూడా మిత్రుత్వం ఎలా పొందాలో వివరిస్తుంది శ్రీరాముని జీవనశైలి.

అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు:
పంచేయాద్రిలపై పూర్తి నియంత్రణ కలిగిన వాడు.. శ్రీరాముడు.. ఆలోచనాపరుడు.. అహంకారం లేని వాడు.. శ్రీరాముడు.. ఆత్మశత్రువుని జయించేవాడు.. శ్రీరాముడు..అందుకే.. శ్రీరామచంద్రమూర్తి పురుషోత్తముడిగా గుర్తింపు పొందాడు. కామం, కోపం, అత్యాశ, అసూయ లాంటి అవలక్షణాలున్న రావణాసురిడిని వధించడం ద్వారా.. ఆ లక్షణాలన్నింటిని రాముడు వధించాడని అంటారు. శ్రీరాముని పాద స్పర్శతో.. మన నేల ధన్యమైందని చెబుతుంటారు.

తండ్రి మాట జవదాటలేదు, నిత్యం.. సత్యమే పలికాడు:
శ్రీరాముని గురించి తెలియనివారుండరు. తండ్రి మాట జవదాటడు. నిత్యం.. సత్యమే పలికేవాడు. హిందువులకే కాదు.. ఇతర మతాల వారికి కూడా శ్రీరాముని గొప్పతనం తెలిసే ఉంటుంది. ఆ అయోధ్య రాముడు.. కేవలం ఆధ్యాత్మిక, చారిత్రక మూర్తి మాత్రమే కాదు. మంచితనానికి, దయకి, నమ్మకానికి.. చిహ్నం లాంటివాడు. అందుకే.. శ్రీరాముడు ఆదర్శపురుడయ్యాడు.

రాముడి జీవితం ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది:
శ్రీరామచంద్రమూర్తి జీవితం మొత్తం.. ఈ ప్రపంచానికి ఓ మంచి పుస్తకంలాంటిది. మనిషిగా జన్మించాక.. అతని వ్యక్తిత్వం ఎలా ఉండాలి.. ఎలాంటి జీవితాన్ని గడపాలి.. బంధు, మిత్రులతో ఎలా వ్యవహరించాలి.. ప్రజలతో ఎలా మమేకమైపోవాలి.. కష్ట, సుఖాల్లో ఎలా ముందుకు సాగాలన్న వాటిని ఆచరించి.. చూపించిన వాడు శ్రీరాముడు.

ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అడవులకు:
తల్లిదండ్రుల గారాలపట్టీ అయిన శ్రీరాముడు.. 17 ఏళ్ల వయసులోనే విశ్వామిత్రుడి వెంట అడవులకు వెళ్లమంటే.. మరో మాట మాట్లాడకుండా వెళ్లాడు. తల్లిదండ్రులను దైవంగా భావించటానికి.. ఇంతకంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. పెళ్లి చేసుకున్న రెండు నెలలకే.. రాజుగా పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గరపడగానే.. పద్నాలుగేళ్లు వనవాసం చేయమంటే.. ఒక్క నిమిషం ఆలోచించకుండా అడవులకు వెళ్లాడు శ్రీరామచంద్రప్రభువు. జననీ.. జన్మభూమిశ్చ.. స్వర్గాదపీ గరీయసీ.. అన్నది కూడా మన అయోధ్య రాముడే. కన్నతల్లి, జన్మభూమి.. స్వర్గంతో సమానమన్నాడు కాబట్టే.. రాముడు ఉత్తమ పురుషుడయ్యాడు.

రాముడు ఏకపత్నీవ్రతుడు:
ఒక అన్నగా.. తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు రాముడు. ఆయన తమ్ముళ్లు కూడా.. అన్న పట్ల అదే రకమైన ప్రేమతో ఉన్నారు. తల్లులు వేరైనా.. ఏనాడూ తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు. శ్రీరాముని కాలంలో.. రాజులకు ఎంతోమంది భార్యలు ఉండేవారు. అలాంటి సమయంలో కూడా.. రాముడు ఏకపత్నీవ్రతుడిగా పేరు సంపాదించాడు. దాదాపు 11 వేల ఏళ్లు.. అయోధ్యను పరిపాలించిన శ్రీరామచంద్రప్రభువు.. సీతాదేవిని తప్ప మరో మహిళను వివాహమాడలేదు. ఆనాటి నుంచే.. ఒక భార్యను కలిగి ఉండాలనేది.. కట్టుబాటుగా మారింది. చాలా మంది.. రాముడే ఆదర్శంగా ఒకరినే వివాహమాడారు.