రథసప్తమికి జిల్లేడుకి సంబంధం ఏమిటి?

రథసప్తమికి జిల్లేడుకి సంబంధం ఏమిటి?

inter relation between ratha saptami and Calotropis gigantea : రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది. దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహానిష్ఠతో చాలా యజ్ఞాలు చేశారు.

ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది, వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు. ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిష్వాత్తులు. ఆ దేవవిమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు.

అయితే ఆసమయంలో పెద్దగాలిరావడంతో కొంత వేడివేడి నెయ్యి ప్రక్కనే ఉన్న ఒక మేకపై పడింది. ఆ వేడికి మేకచర్మం ఊడిపోయి మరణించింది. దాని ఆత్మ వీరికంటే ముందుగా వెళ్ళి దేవవిమానంలో కూర్చుంది. ఆచర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది. అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్త్వం మారిపోయి, మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది.

అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్యధారలు ధరించడంతో పరమపవిత్రం అయ్యింది. జిల్లేడు ఆకును ముట్టుకొంటే మేకచర్మంలా మెత్తగా ఉంటుందందుకే! జరిగిన దానికి అగ్నిష్వాత్తులు బాధపడ్డారు.  అప్పుడు ఆకాశవాణి, “మీరు దుఃఖించాల్సిన పనిలేదు. మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి, దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది.

ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది” అని పలికింది. ఆ మాట అగ్నిష్వాత్తుల్ని సంతోషపరిచింది. అది మాఘశుద్ధ సప్తమీతిథి.  అప్పటి నుండి రథసప్తమినాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకుని, సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేశమాత్రం యజ్ఞఫలం లభిస్తోంది. ఏడుజన్మల పాపాలు పోతున్నాయి.