Hanuman Birth Place : హనుమంతుడి జన్మస్ధలంపై కొనసాగుతున్న వివాదం

Hanuman Birth Place : హనుమంతుడి జన్మస్ధలంపై కొనసాగుతున్న వివాదం

Lord Hanuman Birth Place Dispute

Lord Hanuman Birth Place Dispute : ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి?  చరిత్రకారులు ఏమంటున్నారు? టీటీడీ చెబుతున్న ఆధారాలు ఎంత వరకు నిజం? కన్నడిగుల వాదనల్లో పస ఎంత? వారు చూపిస్తున్న ఆధారాలేంటి?

రామబంటు హనుమంతుడి జన్మస్థలంపై వివాదం రాజుకుంది. ఆంజనేయుడిన జన్మస్థలం ఎక్కడనే ఒక్క ప్రశ్నకు ఎన్నో సమాధానాలు. కొందరు మహారాష్ట్రల్లో అంటుంటే, మరికొందరు గుజరాత్ అంటున్నారు. ఇంకొందరైతే జార్ఖండ్‌లోనే హనుమంతుడు జన్మిండానికి కొత్త వాదనలు వినిపిస్తున్నారు. అవేవీ కావు.. హనుమంతుని జన్మస్థానం తిరుమలేనని… అంజనాద్రే మారుతి పుట్టిన ప్రాంతమని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. దీంతో ఎప్పటి నుంచో హనుమంతుని జన్మస్థలంపై కొనసాగుతున్న వివాదం మరోసారి రాజుకుంది.

అంజనాద్రిలోనే ఆంజనేయుడు పుట్టాడంటున్న టీటీడీ… అందుకు చారిత్రక ఆధారాలున్నాయని, వాటిని ఉగాది నాడు ప్రకటిస్తామని పేర్కొంది. కానీ, ఇప్పుడు ఆ ప్రకటనను వాయిదా వేసుకుంది. శ్రీరామనవమి రోజున ప్రకటిస్తామని చెబుతోంది టీటీడీ. ఇప్పటికే టీటీడీ పండితులు, నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, పరిశోధించి హనుమంతుడి జన్మస్థానం తిరుమలేనని నిర్ధారించామంటోంది. ఈ ప్రకటనతో వివాదం మళ్లీ మొదలైంది.

అసలు ఆంజనేయుడు జన్మించింది తమ ప్రాంతంలోనేనని కన్నడిగులు వాదిస్తున్నారు. టీటీడీ ప్రకటనపై కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆంజనేయుని పుట్టుక ప్రాంతం హంపియే అనేందుకు ఆధారాలు ఉన్నాయని వారంటున్నారు. టీటీడీ తొందర పడకుండా, నిపుణులను, చరిత్రకారులను సంప్రదించిన తర్వాతే  ప్రకటించాలని హితవు పలుకుతున్నారు.

కన్నడ ప్రాంతం నుంచి వస్తున్న అభ్యంతరాల కారణంగానే టీటీడీ కాస్త వెనక్కు తగ్గినట్టుగా కనిపిస్తోంది. కన్నడ ప్రాంతం అభిప్రాయాలను పట్టించుకోకుండా ప్రకటన చేస్తే.. తిరుమలను వివాదాల్లోకి లాగినట్లవుతుందన్న ఉద్దేశంతోనే ఉగాది నాడు ప్రకటిస్తామన్న నిర్ణయాన్ని శ్రీరామనవమికి వాయిదా వేసినట్లుగా భావిస్తున్నారు. ఒక్క ప్రకటన మాత్రమే కాదని.. ఆధారాలను కూడా చూపిస్తామని టీటీడీ చెబుతోంది.

హ‌నుమంతుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలు సేక‌రించామంటోంది టీటీడీ. శివ‌, బ్రహ్మ, బ్రహ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హాత్మ్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్రకారం శ్రీ వేంక‌టేశ్వర‌స్వామి వారి చెంత ఉన్న అంజ‌నాద్రి.. ఆంజ‌నేయుని జ‌న్మస్థాన‌మ‌ని యుగం ప్రకారం, తేదీ ప్రకారం నిర్ధారించారు. దీన్ని పుస‌్తక రూపంలో తీసుకు వస్తామని కూడా చెబుతోంది టీటీడీ.

హనుమంతుని జన్మస్థలం అంశంపై వివాదం రేగే అవకాశం ఉందని తెలిసి కూడా టీటీడీ ఎందుకు ఇంత ఉత్సాహం చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే తిరుమలపై వివాదాలు రేగకుండా ఉంటాయని కొంత మంది సూచిస్తున్నారు.

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుమలే హనుమంతుడి జన్మస్థలం… ఇవిగో ఆధారాలంటూ చెప్పారు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి. టీటీడీ పండితులతో ఏర్పాటు చేసిన కమిటీ దీన్ని నిర్ధారించిందన్నారు. అన్ని ఆధారాలతో నివేదికను తయారు చేశామన్నారు. ఆ నివేదికను ప్రజల ముందుంచి త్వరలో అభిప్రాయాలను సేకరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అధికారికంగా హునమంతుడి జన్మస్థలం తమదేనని ఏ రాష్ట్రం ప్రకటించ లేదని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ తమ దగ్గర ఆధారాలు ఉంటే ఏ రాష్ట్రమైనా బయట పెట్టవచ్చన్నారు జవహర్‌రెడ్డి.

ఏడు కొండలే మారుతి అసలైన జన్మస్థలమని చాలా రోజల నుంచి టీటీడీ వాదిస్తూనే ఉంది. గతంలో నిరూపిస్తామని చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలు ముందుకు పడలేదు. కానీ, ఈసారి హనుమంతుడి జన్మస్థలంపై నిగ్గు తేల్చడానికి వేసిన కమిటీ తమ నివేదికలో అన్ని అంశాలను స్పష్టం చేసింది. త్వరలోనే దీన్ని ప్రజల ముందు పెట్టనున్నారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయలని ఈవో జవహర్ రెడ్డి కోరారు.

ఇన్నాళ్లూ తెరపైకి రాని హనుమ జన్మస్థలం ఇప్పుడు రావడానికి ఎలాంటి కారణం లేదంటున్నారు కొందరు. హనుమ జన్మస్థలం తిరుమల కొండల్లోని జాపాలి తీర్థం అని, దానిని టీటీడీ నిర్లక్ష్యం చేస్తోందని చరిత్రకారులు, భక్తులు చాలా కాలం నుంచి విమర్శలు చేస్తున్నారు. వాటికి సమాధానం చెప్పడానికే టీటీడీ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలున్నాయి.

హనుమ జన్మస్థలం అంజనాద్రి పేరిట డాక్టర్ ఏవీఎస్‌జీ హనుమత్‌ ప్రసాద్ ఓ గ్రంథాన్ని రచించారు. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికం అని, స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు చెబుతున్నాయి. హనుమంతుడి జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. మరి టీటీడీ చూపించబోయే ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి.

మరోపక్క, చరిత్రకారులు మాత్రం హంపి లేదా విజయనగర సామ్రాజ్య పరిధిలోని కిష్కింద క్షేత్రం హనుమాన్‌ జన్మస్థలమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ఆధారాలున్నాయంటున్నారు. సంగంకల్లు, బెళకల్లు ప్రాంతాల్లోని గుహల్లో హనుమాన్‌కు సంబంధించి తోక ఆకారంలో చాలా చిత్రాలు ఉన్నాయని చెబుతున్నారు. అందుకే హనుమాన్‌ జాతికి చెందిన వానరుడని అంటారని వాదిస్తున్నారు.

బళ్లారి ప్రాంతంలో చాలా పెయింటింగ్స్‌లో మనుషుల ఆకారంలో ఉంటూ.. వెనుక భాగంలో తోకలు ఉన్నట్టుగా గుర్తించారని చెబుతున్నారు. హంపి చుట్టు పక్కల వెయ్యికి పైగా హనుమంతుడి శిల్పాలున్నాయంటున్నారు. తిరుమలలో కాకుండా ఎక్కువగా హనుమంతుని శిల్పాలు హంపి ప్రాంతంలోనే ఎందుకున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు.

అనెగుండి అనే ప్రాంతమే నాడు వాలి కుమారుడు అంగదుడున్న ప్రాంతమని కర్ణాటకకు చెందిన పలువురు చెబుతున్నారు. తుంగభద్ర నది, మాల్యవంత, రిష్యమూక, కిష్కింద, మాతంగ, అంజనాద్రి ఉండే ప్రాంతమే పంపా సరోవరం అని అంటున్నారు. పంపా క్షేత్రమే కిష్కింద అని, దాని పరిసరాల్లో పెద్ద సంఖ్యలో హనుమాన్‌ ఆలయాలున్నాయని వివరిస్తున్నారు.

హనుమంతుడు జన్మ స్థలంపై వివాదం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి అంజనీపుత్రుడి జన్మస్థలంపై వివాదాలు, వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు టీటీడీ తీసుకొచ్చిన వాదనలను కర్ణాటకకు చెందిన కొన్ని సంస్థలు కొట్టిపారేస్తున్నాయి. వాటిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలు కన్నడిగుల వాదన ఏంటి? టీటీడీ చూపించే ఆధారాలతో అన్ని వర్గాలు ఏకీభవిస్తాయా?  ఎవరికి వారే తమ ప్రాంతంలో పుట్టారంటూ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలు, కథలు ప్రచారంలోకి తెచ్చారు. తాజాగా టీటీడీ ప్రకటనతో ఈ ఇష్యూ.. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక మధ్య తెగని పంచాయితీగా మారింది.

పచ్చని కొండల నుదుటిన ఎర్రటి సింధూరంగా విరాజిల్లుతున్న జాపాలి మహా తీర్థమే మారుతి జన్మస్థలమని చరిత్రకారులు, పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అంజనాద్రి పర్వతంలోనే హనుమంతుడు జన్మించాడని వేదగ్రంథాలు చెబుతున్నాయి. హనుమ చరిత్రకు శ్రీ పరాశర సంహిత గ్రంథం ప్రామాణికమని, స్కంధ పురాణంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించినట్లు ఆధారాలున్నాయి.

అంజనాద్రి పర్వతంపై ఉన్న జాపాలి ప్రాంతంలో హనుమాన్ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయాన్ని కూడా నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మొదట దట్టమైన అటవీ ప్రాంతంలో పూజకు నోచుకోని ఈ ఆలయంలో 15వ శతాబ్దం నుంచి నిత్య పూజలు, దూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

ఇక, తిరుమలలో స్వామి వారి ఆలయానికి అభిముఖంగా అంజలి ఘటిస్తున్న భంగిమలో బేడి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. త్రేతాయుగంలో రామభద్రునికి సేవ చేసిన హనుమంతుడు.. కలియుగంలో వెంకటేశ్వరుడినే రాముడిగా భావించి కనులారా స్వామి వారిని వీక్షిస్తూ ఆయనకు సేవ చేస్తున్నాడు. భగవంతుడికి భక్తుడు ఎప్పుడూ ఒక మెట్టుపైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయాని కంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఈ ఆధారాలతోనే హనుమంతుని జన్మస్థలం తిరుమలే అని నిరూపించేందుకు టీటీడీ పాలకమండలి అన్ని ఆధారాలతో సిద్ధమైంది.

మరోపక్క అంజనీపుత్రుని జన్మస్థలం ఇక్కడే అంటూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి చెందుతున్నాయి. అంజనాదేవి హనుమంతునికి జన్మనిచ్చిన స్థలంగా మరికొన్ని ఆలయాలు విరాజిల్లుతున్నాయి. అందులో ముఖ్యంగా తిరుమలలో వెలసిన జాపాలి హనుమాన్ ఆలయ ఒకటి. తిరుమల గిరులకు అంజనాద్రి అనే పేరు ఎలా వచ్చింది? ఆంజనేయుడికి తిరుమల గిరులకు ఉన్న సంబంధం ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే త్రేతాయుగం కాలం నాటికి వెళ్లాల్సిందే.

కృతయుగంలో తిరుమల కొండను వృషభాద్రి అని, త్రేతాయుగంలో అంజనాద్రని, ద్వాపర యుగంలో శేషాచలం అని, కలియుగంలో వేంకటాచలం పేర్లతో పిలుస్తున్నారని పురాణాల్లో ఉన్నాయి. భావిశోత్తర పురాణంలోని మొదటి అధ్యయంలోని 79వ శ్లోకంలో నుంచి హనుమ జన్మస్థలం, జన్మ రహస్యం గురించి ఉంది. వీటన్నింటి ఆధారంగానే తిరుమల గిరుల్లోని జాపాలి తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలి అంటున్నారు పరమ భక్తులు. ఇదే సమయంలో కర్ణాటక… కొత్త వాదన తెరపైకి తెచ్చింది. హనుమంతుడు పుట్టింది, నడయాడింది అంతా తమ రాష్ట్రంలోనే అని వాదిస్తోంది. ఫలితంగా ఇప్పుడు ఆంజనేయుడి పుట్టుక వివాదాస్పదమైంది.

నిజానికి హనుమంతుడు సంచరించినప్పుడు చూసిన వారెవరూ లేరు. ఆనాటి గ్రంథాలు, చరిత్రకారుల నుంచి మాత్రమే కాలాన్ని లెక్కిస్తున్నారు. ఆధారాలు లేకపోవడం వల్ల.. చాలామంది పౌరాణిక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు. తిరుమలే హనుమంతుడి జన్మస్థలమంటున్న టీటీడీ ప్రకటనతో విభేదిస్తున్న కర్ణాటక… ఆ రాష్ట్రంలోని కొప్పల్ జిల్లా అనెగుందికి సమీపంలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలమని చెబుతోంది. ఆ ప్రదేశాన్ని కిష్కింద అని కూడా పిలుస్తున్నారు. రామాయణంలోనూ కిష్కింద ప్రస్తావన ఉందని, హనుమంతుడి అసలైన జన్మస్థలం ఇదేనని కర్ణాటక వాదిస్తోంది.

హనుమంతుడు కర్ణాటకలోని అరేబియా సముద్రం ఒడ్డున జన్మించాడని మరో వాదన కూడా ఉంది. షిమోగలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి ఈ అంశాన్ని ప్రస్తావించారు. రామాయణంలో సీతకు హనుమంతుడు అదే విషయాన్ని ప్రస్తావించాడని ఆయన చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన విశ్వహిందూ పరిషత్‌ నేతలు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు సైతం టీటీడీ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

టీటీడీ ప్రకటనపైనే విభేదాలు వస్తున్న నేపథ్యంలో… అది చూపించే ఆధారాలతో అందరూ ఏకీభవిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి టీటీడీ పరిశోధన కమిటీ ఎలాంటి సమాధానాలు చెబుతుందో చూడాలి. ఇంత సున్నితమైన అంశాన్ని దేశవ్యాప్త నిపుణుల ఏకాభిప్రాయంతో ప్రకటించినప్పుడే వివాదాలు రేగకుండా ఉంటాయని కొంతమంది సూచిస్తున్నారు.