రామాయణ కీలక ఘట్టాల్లో బయటపడిన సద్గుణాలు..

  • Published By: sreehari ,Published On : August 4, 2020 / 02:26 PM IST
రామాయణ కీలక ఘట్టాల్లో బయటపడిన సద్గుణాలు..

రామాయణంలోని ప్రతి కీలక ఘట్టంలో.. శ్రీరాముని మర్యాద గుణం బయటపడుతూనే ఉంది. పడవపై దాటించిన గుహుడు, ఎంగిలి పళ్లను ఇచ్చిన శబరి, సీత జాడ చెప్పిన జటాయువు, సేతు నిర్మాణంలో ఉడుత, శరణు కోరిన రావణుని తమ్ముడు, చివరకు తొలి రోజు యుద్ధంలో నిరాయుధుడైన రావణున్ని సైతం వదిలేసిన ఉదాత్త పురుషుడు కాబట్టే ఆయన అన్నింటా అందరికీ, తరతరాలకు, యుగయుగాలకు ఆదర్శమయ్యాడు.

రాముడు.. మర్యాదా పురుషోత్తముడు..
రాముడు ఎంత గుణవంతుడో.. ఎంతటి మర్యాదాపురుషోత్తముడో.. రామాయణంలోని ప్రతి కీలక ఘట్టంలో బయటపడుతూనే వచ్చింది. సీతాపహరణం తర్వాత.. ఆమె జాడ తెలియజేయడంలో జటాయువు సహకరించింది. ఈ క్రమంలో.. అది కూడా మరణించింది. అయినప్పటికీ. తన తండ్రికి ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారో.. అలాగే జటాయువుకి కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించారు శ్రీరామచంద్రుడు. దీనిని బట్టే అర్థమవుతోంది.. రాముడు ఎంత మర్యాదా పురుషోత్తముడో. పశు,పక్ష్యాదులు కూడా మనతో సమానమేనని.. ఆనాడే చెప్పాడు రాముడు.



అందుకే వాలిని అలా చంపాడట :
సీతాన్వేషణలో భాగంగా.. సుగ్రీవుడితో స్నేహం కుదిరాక.. ఆ స్నేహాన్ని నిలబెట్టుకొని.. తమ్ముడి భార్యను తన వశం చేసుకున్న వాలని సంహరించాడు శ్రీరామచంద్రుడు. ఐతే.. వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు రాముడు. అంతటి వీరుడు.. చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానికి.. రకరకాల సమాధానాలున్నాయి. కొందరేమో.. జంతువును చెట్టు చాటు నుంచి చంపటం తప్పుకాదన్నారు. మరికొందరేమో.. వాలిలో గొప్ప శక్తి ఉందని చెప్పారు. ఆయన ముందు.. ఎవరు నిలబడినా.. ఆయనను చూసిన వెంటనే వారి బలం సగానికి తగ్గిపోతుందని చెప్పారు. అందుకే.. రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడని చెబుతుంటారు.

రావణాసురుడిని వధించాక.. లంకకు రాజు లేకుండా పోతాడు. లంకనంతటిని.. ఆక్రమించి అఖండ భారతావనిలో కలిపేసే అవకాశం కూడా అప్పుడు రామునికి ఉంది. కానీ.. లంకకు రావణాసురుడి తమ్ముడైన విభీషణుడిని రాజును చేశాడు. వాళ్ల రాజ్యం.. వాళ్లకే అప్పగించాడు. యుద్ధం ముగిశాక.. లక్ష్మణుడు కూడా లంకను చూసి మురిసిపోయి.. అక్కడే ఉండిపోదామని అడిగాడు.



కానీ.. ఇతరుల రాజ్యాలను ఆక్రమించుకోవడం మంచి పద్ధతి కాదని హితవు పలికాడు శ్రీరామచంద్రమూర్తి. ఇలా.. రామాయణంలోని ప్రతి ఘట్టంలో.. రాముని మర్యాద, మంచి గుణం బయటకొస్తూనే ఉన్నాయి. ఆనాడు రాముడు అనుసరించిన జీవన విధానమే.. ప్రజలందరికీ ఆదర్శమైంది. అందుకే.. రాముడు ఆదర్శప్రాయుడయ్యాడు. ఆరాధ్య దైవమయ్యాడు.

మనిషే.. దేవుడిగా ఎదిగిన చరిత్ర..
శ్రీరాముని జీవితమంతా విపత్తులు, కష్టాలే. సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. అరణ్యవాసం చేశాడు. సొంత పిల్లలతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇంత జరిగినా, జనం ఇంకా ఎందుకు రాముడిని ఆరాధిస్తారంటే.. అందుకు ఆయనలో ఉన్న సుద్గుణాలే కారణం. శ్రీరాముని ప్రత్యేకత.. ఆయన ఎదుర్కొన్న పరిస్థితుల్లో లేదు. ఎదురైన విపత్తుల్లో.. ఆయనెంత ఉన్నతంగా నడచుకున్నారన్న దానిలోనే ఆయన ఔన్నత్యం ఉంది.

ఏనాడూ.. శ్రీరామచంద్రమూర్తిలో కోపం లేదు. ఎవరినీ నిందించలేదు. ఎల్లవేళలా.. ఉదాత్తంగా, హుందాగా నడచుకున్నాడు. అందుకే.. పవిత్ర జీవనాన్ని, ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులంతా.. శ్రీరామచంద్రునిలా జీవించాలని తపిస్తారు. తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు.

కానీ.. అన్ని వేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. కానీ.. అన్ని పరిస్థితుల్లోనూ ఉదాత్తంగా, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. రావణ వధ తర్వాత.. సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడు రాముడు. ఇది.. శ్రీరామ పట్టాభిషేకానికి ముందు జరిగింది.

రాజుగా.. ప్రజాజీవితంలోకి అడుగుపెట్టే వ్యక్తిపై.. ఎలాంటి మరక ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే.. రాముడు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించాడనే వాదన కూడా ఉంది. శ్రీరామచంద్రుడు.. రాజయ్యాక.. ప్రజలే సర్వస్వం అయ్యారు. పాలకుడిగా.. ప్రజల అభిప్రాయాలకు ఎంత గౌరవం ఇవ్వాలో.. ఆచరించి చూపాడు. అందుకే.. ఇప్పటికీ రామరాజ్యం అనే పదం వాడుకలో ఉంది.

11 ఏళ్లు భూమిని పాలించి.. వైకుంఠానికి వెళ్లి… :
శ్రీరాముడి పాలనను స్వర్ణ యుగంగా చెబుతారు. రామరాజ్యంలో.. మోసపూరితమైన లక్షణాలు ప్రజలలో ఉండేవి కావు. ప్రతి ఒక్కరూ.. మరొకరితో సఖ్యంగా, మంచి మర్యాదలతో మెలిగేవారు. ఎలాంటి.. కల్మషం ఉండేది కాదు. పేదరికం అనే ప్రశ్నే తలెత్తేది కాదు. ప్రతి ఒక్కరు.. సిరి, సంపదలతో తులతూగేవారు. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత.. 11 వేల ఏళ్ల పాటు రాముడు ఈ భూమిని పరిపాలించి.. తిరిగి వైకుంఠానికి వెళ్లిపోయాడట. రాముడి నిజమైన వ్యక్తిత్వాన్ని.. వాల్మీ మాత్రమే ఆవిష్కరించాడు.

ఈనాటి మన పాలకుంతా.. మైకుల ముందు ఊదరగొట్టే స్పీచ్‌ల్లో.. తరచూ చెప్పే మాట.. మళ్ళీ రామరాజ్యం తెస్తామని. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. రామరాజ్యం ఎలా ఉండేదో. సమస్య ఎదురైనప్పుడు.. నాకేమీ జరగదు అనుకోని బతకడం మూర్ఖత్వమవుతుంది. ఎలాంటి సమస్య వచ్చినా.. దానిని ధైర్యంగా ఎదుర్కొంటాననుకోవడమే వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత శ్రీరామునిలో కనిపిస్తుంది. అందుకే.. జనులకు ఆయన ఆరాధ్యుడయ్యాడు. ఏం జరిగినా సరే.. మనల్ని మనం ఎలా నిలుపు కుంటున్నా మన్నదే అసలు విషయం. ఇది.. రాముని నుంచి మనం పొందాల్సిన స్ఫూర్తి.