ఇంద్రకీలాద్రిపై మార్చి 9 నుంచి మహాశివరాత్రి వేడుకలు

ఇంద్రకీలాద్రిపై మార్చి 9 నుంచి మహాశివరాత్రి వేడుకలు

mahasivaratri festivals inauguration on march 9th at indrakeeladri : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై(దుర్గగుడి) మహాశివరాత్రి వేడుకలు ఈ నెల 9 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు స్థానాచార్య శివప్రసాదశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ఉదయం 8 గంటలకు గంగా, పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలో మంగళ స్నానాలు నిర్వహించి, వధూవరులుగా అలంకరిస్తారు.

సాయంత్రం 4గంటలకు మండపారాధన, కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన, మూల మంత్ర హవనాలతో మహాశివరాత్రి వేడుకలకు అంకురార్పణ చేస్తారు. 10, 11 తేదీల్లో ఉదయం 8కి, సాయంత్రం 4గంటలకు మండపారాధన, కలశారాధన, హారతులు, 11న రాత్రి 8.30 గంటలకు మహాన్యాసం, లింగోద్భవకాలంలో అభిషేకం అనంతరం శ్రీగంగా, పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి దివ్యలీలాకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

12న ఉదయం, సాయంత్రం స్వామికి మండపారాధన, కలశారాధన, హారతులు, 13న ఉదయం 9గంటలకు పూర్ణాహుతి, ధ్వజావరోహణం, సాయంత్రం కెనాల్‌ రోడ్డులో కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో రథోత్సవం, 14న దుర్గాఘాట్‌లో 9గంటలకు అవభృధోత్సవం, సాయంత్రం 7కి పంచహారతులు, ద్వాదశప్రదక్షిణలు, 15, 16 తేదీల్లో రాత్రి 8గంటలకు ఆది దంపతులకు పవళింపు సేవ నిర్వహిస్తారని తెలిపారు.