రథ సప్తమి విశిష్టత

రథ సప్తమి విశిష్టత

significance of ratha saptami : చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు.

అదితి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా, ‘సూర్య జయంతి’గా జరుపుకుంటారు. దానినే ‘రథ సప్తమి’ అంటారు. ఆరోజున సూర్యుడిని ఆరాధిస్తుంటారు. ఆ పుణ్య  దినాన  ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. రథసప్తమి రోజున పూజ ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి ? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సూర్యుడు తన రథం దిశను మార్చుకునే రోజు..
సూర్యుడు అనంతమైన కాలానికి అధిపతి. విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. ‘భాసం’ అంటే ప్రకాశం. ‘కరుడు’ చేసేవాడు ‘భాస్కరుడు’ అంటే ‘జగత్తును ప్రకాశవంతం చేసేవాడు’ అని అర్థం. సూర్యభగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలకంగానూ, రాత్రివేళలో నిద్రాసక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుడిని శక్తి కేంద్రంగా, ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగఛ్ఛక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చే వానిగా భావించింది.

సూర్య మండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అంతశ్చేతనలోని అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలేవానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపునూ, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవానిగా భావించి ఉపాసించింది. ‘సప్తాశ్వాలను’ ఏడు వారాలుగా, ఏకచక్రాన్ని ‘కాలచక్రం’గా చెప్తారు.

సూర్యుని రథానికి ఉన్నదొకటే చక్రం. సారథి ఊరువులు లేనివాడు. గుర్రాలు వాయువు. పాములు లేదా గాలితెరలను పగ్గాలుగా చెప్తుంటారు. ఇన్ని ఆటంకాలున్నా సూర్యుడు తన కర్తవ్యాన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిర్వహిస్తూ- ‘క్రియాసిద్ధిః సత్వేభవతి మహతాం నోపకరణైః. ఉపకరణాలు లేకున్నా సంకల్పంతో కార్యాన్ని సాధించాలనే’ జీవనసత్యాన్ని విశ్వానికి తెలియజేస్తాడు. వాస్తవానికి ‘సప్త అశ్వాలు’ అంటే అయిదు జ్ఞానేంద్రియాలు అని అంటుంటారు.

అందులో మనసు, బుద్ధి.. ఇవే సూర్యుని అశ్వాలు. శరీరమే రథం. ఆశ్వాలు ఇంద్రియాలు, బుద్ధి సారథి, మనసు పగ్గాలు. యోగశాస్ర్తానుసారం దేహమనే రథంలో కుండలినీ శక్తియే ఏకచక్రం. శట్చక్రాలు ఆ చక్రానికి ఉన్న ఆకులు. సప్తాశ్వాలు మహత్తు, అహంకారం, పృథ్వి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. జ్యోతి రూపంలో అంతరంగంలో ప్రకాశించే భగవఛ్ఛక్తియే సూర్యుడు. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్ళించడం ఈ రోజు విశేషం.

వ్రతకథ…
పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ వ్రత విధానాన్ని, వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వ కాలంలో కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండే వాడు. ఆ కుమారుడు ఎప్పుడూ వ్యాధుల భారీన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు.

అప్పుడు బ్రహ్మాణులు “నీ కుమారుడు పూర్వ జన్మమున పరమలోభియైన వైశ్యుడు. రథసప్తమీ మహాత్మ్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యెను అని చెప్పారు. దీనికి పరిహారమడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు. ఏవ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమీ వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని రుషులు చెప్పాగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలుపుతాడు.