రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబు

  • Published By: veegamteam ,Published On : April 18, 2019 / 03:51 AM IST
రాములోరి కల్యాణానికి ఒంటిమిట్ట ముస్తాబు

ఆంధ్రుల భద్రాద్రి ఆధ్యాత్మిక కాంతులీనుతోంది. కడప జిల్లా ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాళ రాత్రి పండు వెన్నెల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. స్వామి ప్రసాదం మొదలు క్యూలైన్ల వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా… టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో.. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నేడు శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుంది. రాత్రి 8గంటల నుండి 10గంటల వరకు ఆదర్శ దంపతుల వివాహామహోత్సవాన్ని నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండడంతో.. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం.. విస్తృత ఏర్పాట్లు చేసింది. 

సీతారాముల కల్యాణం కోసం ఏర్పాటు చేస్తున్న కల్యాణ వేదికను భూలోక‌ నందనవనాన్ని మరిపించేలా టిటిడి ఉద్యానవన విభాగం తీర్చిదిద్దుతోంది.  బెంగళూరుకు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది కలిపి దాదాపు 50 మంది ఇందుకోసం పనిచేస్తున్నారు. చెరుకు గడలు, టెంకాయపూత, అర‌టి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ఆఫ్రికన్‌ ఆరంజ్‌, గ్రీన్‌ ఆపిల్‌, రెడ్‌ ఆపిల్‌, నలుపు, ఆకుపచ్చ ద్రాక్ష, దోస, మొక్కజొన్న సహా ఇతర ఫలాలు, సంప్రదాయపుష్పాలు, నీలం ఆర్కిడ్‌, రెడ్‌ ఆంథూరియం తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణవేదికను అలంకరిస్తున్నారు. అలాగే.. రంగు రంగుల విద్యుద్దీపాలను అలంకరించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కల్యాణవేదిక ప్రాంగణంలో 20 ఎల్‌ఇడి స్క్రీన్లు, లేజర్‌ లైట్లు ఏర్పాటుచేశారు. కల్యాణవేదిక ప్రాంతాల్లో శ్రీరామ పట్టాభిషేకం, సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుజ్ఞులు, రామాయణంలోని ఘట్టాలు, శ్రీ మ‌హావిష్ణు విశ్వరూపాల కటౌట్లను జీవం ఉట్టిపడేలా రూపొందించారు.

సీతారాముల కల్యాణాన్ని.. భక్తులు కనురాలా వీక్షించేలా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దాదాపు ల‌క్ష మంది భ‌క్తులు పండువెన్నెల‌లో కూర్చుని క‌ల్యాణాన్ని తిల‌కించేలా గ్యాలరీలు తీర్చిదిద్దింది. గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని ప‌టిష్టంగా జ‌ర్మన్ షెడ్లను నిర్మించింది. అదేవిధంగా ప్రముఖుల కోసం కల్యాణవేదిక పక్కన మరో వేదిక రూపొందించింది. రద్దీని నిలువరించేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటు చేసింది. 

అందరినీ ఆకట్టుకునేలా వేదిక ముఖ‌ద్వారాన్ని తీర్చిదిద్దారు. మొత్తం మూడు ద్వారాలుండ‌గా, మ‌ధ్య ద్వారాన్ని శ్రీ సీతారాముల ఉత్సవ‌ర్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు కేటాయించారు. మిగిలిన రెండు ద్వారాల గుండా భ‌క్తులను అనుమ‌తించనున్నారు.

కల్యాణోత్సవంలో దాదాపు 1200 మంది శ్రీ‌వారి సేవ‌కులు, 500 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భ‌క్తుల‌కు సేవ‌లందించ‌నున్నారు. శ్రీ సీతారాముల కల్యాణంలో పాల్గొనే భక్తులందరికీ ముత్యంతో కూడిన తలంబ్రాలు అందించేందుకు 2 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేశారు. క‌ల్యాణ వేదికకు కుడి, ఎడ‌మ వైపు 150 ప్రసాద వితరణ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, అక్షింత‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా ఆల‌యం వ‌ద్ద ప్రతి రోజు ఉద‌యం 11.00 నుండి రాత్రి 10.00 గంట‌ల వ‌ర‌కు సాంబార‌న్నం, పెరుగ‌న్నం పంపిణీ చేస్తున్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని.. 6 ల‌క్షల తాగునీటి ప్యాకెట్లు, 2 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. దాదాపు 300 తాత్కాలిక, మొబైల్‌, శాశ్వత మరుగుదొడ్లు, నీటి వసతిని టిటిడి, జిల్లా ఆరోగ్య విభాగంతో క‌లిసి ఏర్పాటు చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం దాదాపు 450 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియ‌మించారు. అత్యవసర వైద్య సేవలకోసం ప్రత్యే వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. 

శ్రీసీతారాముల కల్యాణానికి వేలాదిగా భక్తులు తరలి రానుండటంతో పాటు.. ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో.. పోలీసులు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 2 వేల మంది పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు. రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ద్వారా భక్తులకు సమాచారం, సూచనలు ఇవ్వనున్నారు. ఆలయ పరిసరాలతో పాటు.. చెరువు కట్ట, కల్యాణవేదిక పక్కన వాహనాల పార్కింగ్‌ కోసం ప్రదేశాలు సిద్ధం చేశారు.