టీటీడీ శుభవార్త : సుప్రభాత సేవ పున:ప్రారంభం

టీటీడీ శుభవార్త : సుప్రభాత సేవ పున:ప్రారంభం

Suprabhata Seva service resumes : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పంది. స్వామి వారి సుప్రభాతసేవ ఈనెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. డిసెంబర్‌ 16న ధనుర్మాసం ప్రారంభమవడంతో అప్పటినుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగుతోంది. ఈనెల 14న ధనుర్మాసం పూర్తికానుండటంతో 15 నుంచి శ్రీవారికి సుప్రభాతసేవ నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగుతాయి.

జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలు :-
తిరుమల శ్రీవారి సన్నిధిలో జనవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 13న భోగి పండుగ‌, 14న మ‌క‌ర సంక్రాంతి, 15న క‌నుమ పండుగ‌, గోదా ప‌రిణ‌యోత్సవం, తిరుమ‌ల శ్రీ‌వారి శ్రీ పార్వేట ఉత్సవం, 28న శ్రీ రామ‌కృష్ణతీర్థ ముక్కోటి, 30న శ్రీ తిరుమొళిశైయాళ్వార్ వ‌ర్షతిరున‌క్షత్రం వేడుక నిర్వహించనున్నారు.

గుంటూరులో కామధేను పూజ :-
ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 15న గుంటూరు జిల్లా నరసరావుపేటలో కామధేనుపూజ నిర్వహించనున్నట్టు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కామధేనుపూజ ఏర్పాట్లపై తిరుపతిలో ఆయన సమీక్షించారు. మరోవైపు సంక్రాంతి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది.