Ugadi Pachchadi : ఉగాది పచ్చడి – ఆరోగ్య సూత్రాలు

ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే... ఆనందమే....ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.

Ugadi Pachchadi : ఉగాది పచ్చడి – ఆరోగ్య సూత్రాలు

Ugadi Recipes

Ugadi Pachchadi – Health Principles : తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఉగాది విశిష్టత గురించి ఎంతైన చెప్పుకోవచ్చు. ఉగాది నాడు సేవించే వేప పువ్వు పచ్చడి గురించి ఒకసారి తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. ఉగాది-వేపపువ్వు పచ్చడి-కాలాన్ని భగవద్రూపంగా భావిస్తే ప్రతిరోజూ, ప్రతి నిముషమూ పండుగే… ఆనందమే….ఇట్టి పవిత్ర విశాల భావన లేకుండా ఆచరించే పండుగలు వ్యర్ధమే అవుతాయి.

పిండివంటలూ, మధుర పదార్థాలూ తిని రజస్తమోగుణాలు నింపుకోవడం తప్ప.. సాత్త్విక ప్రవృత్తి లభించదు.కనుకనే మన పూర్వీకులు ప్రతి పండుగకూ ఒక అధిష్ఠాన దైవం, పూజ, నియమాలూ, ఆహార విశేషాలూ ఏర్పాటు చేసారు. పవిత్ర భావంతో చేసే ప్రతి కార్యమూ ఇహపరానందదాయకమే అవుతుంది.

సంవత్సరాదినాడు తమ తమ ఇష్టదేవతలను పూజించడంతో “ఈసంవత్సరమంతా నాలో దైవానుగ్రహం పుష్కలంగా వుంటుంది. ఏ కార్యమైనా విజయవంతంగా నిర్వహించగలననే ధైర్యం, మనోబలం, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

వేపపూతపచ్చడి …ఉగాదినాడు వేపపూతపచ్చడి (గొజ్జు) తప్పక స్వీకరించాలి. “నింబకుసుమభక్షణం” అని శాస్త్రాలు పేర్కొన్నాయి. “ఉగాది పచ్చడి” అని కూడా అంటారు. ఇది ఒక ఔషధం..శాస్త్రం ప్రకారమైతే “క్రొత్త చింతపండు తెచ్చి, నీటితో పిసికి, గింజలు, ఉట్లు, తొక్కలు లేకుండా తీసివేసి, చిక్కటి గుజ్జు తయారు చేయాలి. అందులో కాడలు, పుల్లలూ లేకుండా శుభ్ర పరచిన వేపపూలూ అందులో కొద్దిగా బెల్లం వేయాలి. కొద్దిగా నెయ్యివేసి, కలియబెట్టి, దేవునికి నివేదించి, ఉదయాన్నే పరగడుపుననే స్వీకరించాలి.

ఈ వేపపూతను స్వీకరించడంవల్ల నూరేండ్ల ఆయువూ, వజ్రసమానమైన దేహం, సర్వసంపదలూ, చేకూరి, సంవత్సరమంతా సుఖంగా వుంటారని పెద్దలు చెపుతారు.కొత్తచిత్తపండు బెల్లంలో వుండే దోషాల తీవ్రత ఉగాది నాటికి’ తగ్గి, అప్పటినుంచీ అవి ఆరోగ్యప్రదాలై, రుచి, శుచీ కల్గివుంటాయని పూర్వుల నిర్ణయం. ఈనాడు వేపపూత గొజ్జులో శాస్త్రంతో పనిలేకుండా – ఇంకా కొన్ని చేర్చుకొని, ఇదంతా షడ్రుచులకు సంకేత మని సమన్వయించుకోవడం ఆచారమయింది.

మామిడి ముక్కలు, ఉప్పు, చెరకు ముక్కలు, అరటి పండ్లు, తేనె కూడా కొందరు కలుపుతారు. కొందరు మిరియాల పొడి లేదా పచ్చి మిరపకాయ ముక్కలు వేస్తారు. మసాలా దినుసులూ వేసేవారున్నారు. ఈ ‘ఉగాదిపచ్చడి’లో మసాలా దినుసులు, ఉప్పు వాడరాదు. వసంతఋతు ప్రారంభంలో ఆకాలంలో దొరికే వేపపువ్వు, బెల్లం, చింతపండు కలిపి, సేవించడం రాగల కాలానికి స్వాగతం చెప్పడమే అవుతుంది.

మధుర ఆమ్ల (తీపి, పులుపు) ద్రవ్యాలతో చేర్చి, చేదురసముండే వేపపువ్వును గొట్టుగా చేసికొని తినడంలో – తియ్యని నోట పండుగపూటా చేదు తినడమేకదా… కాని చేదు వస్తువును తీపు పులుపు పదార్థాలతో కలిపి తినడం కాలానుగుణంగా ఏర్పడే త్రిగుణాత్మక కష్ట,సుఖాలనే ద్వంద్వాలకు మేము సంసిద్ధంగా వున్నాం. ఏకాలానికి ఏది వచ్చినా సంతోషంగానే స్వీకరించి, అనుభవిస్తాం’ అనే ఒక శపథం చేయడానికి ఈ పచ్చడిని సేవించడం సంకేతం అవుతుంది.

వేపపూలు : వేపపువ్వు చేదుగా, రుచిగా వుంటుంది. శ్లేష్మాన్నీ, క్రిమిరోగాలనూ, పైత్యాన్నీ, కుష్టువ్యాధినీ, పోగొడుతుంది. నాలుకకు రుచి,జ్ఞానాన్ని కల్గిస్తుంది. వాతాన్ని హరిస్తుంది. వేపపువ్వును నూనెతోగాని, నెయ్యితోగాని వేయించి, ఉప్పు, కారం కలిపి అన్నంతో స్వీకరిస్తే ఆరోగ్యానికి మంచిది. వేపగాలి, వేపాకులు వేపనూనె ఇలా వేపసంబంధమైనవన్నీ ఆరోగ్య ప్రదాలే.

బెల్లం జ్వరాన్నీ, కడుపునొప్పినీ, ఉదర రోగాలనూ, వాతాన్ని పోగొట్టుంది. ఒంటిలో నీటిని హరిస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. క్రొత్త బెల్లం ఆరోగ్యకారి కాదు. కనుకనే ఉగాదితో ఆ దోషంపోతుంది. పాతబడుతుంది. పచ్చడిలో సేవించినందున ఆరోగ్యాన్ని కల్గిస్తుంది. గుండెదడనుకూడా తగ్గిస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. నిద్రపట్టిస్తుంది. (మితిమీరి సేవింపరాదు)

చింతపండు: క్రొత్త చింతపండు ఆరోగ్యకరం కాదు. ఉగాది నాటికి చింతపండులో క్రొత్తదనం పోతుంది. ఆనాటినుండి వాడవచ్చు. పాత చింతపండు (కనీసం 2/3 నెలలయినా గడవాలి) ఉష్ణాన్ని తగ్గిస్తుంది. వాత, పైత్య, శ్లేష్మ రోగాల్ని హరిస్తుంది. బడలికవల్ల ఏర్పడిన జ్వరాన్ని తగ్గిస్తుంది. హృదయానికి బలాన్ని కల్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. (మంచిదని అధికంగా వాడరాదు)

నెయ్యి: ఆయురారోగ్యాల నిస్తుంది. కంటికి మంచిది. జీర్ణశక్తి నిస్తుంది. బుద్ధి బలాన్ని పెంచుతుంది. శరీరానికి కాంతి నిస్తుంది. విషాన్ని హరిస్తుంది. పిచ్చిని తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఓజస్సును పెంచుతుంది. (శక్తి + కాంతి). (మితిమీరి వాడరాదు)

మామిడి పిందెలు : వడదెబ్బను హరిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్యగుణాలున్న వేపపూత పచ్చడి సేవించడంతో అందలి గుణాలు రక్తంలో కలసిపోయి, సంవత్సరకాలం వాటి ప్రభావాన్ని చూపుతాయి. కనుక ఉగాది నాడు తప్పకుండా వేపపూత పచ్చడి సేవించాలని పెద్దలు సూచించారు.