శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు ఏం చేయాలి

శివుడి అనుగ్రహం కోసం మహాశివరాత్రి రోజు ఏం చేయాలి

What to do on the day of Mahashivaratri for the grace of  Lord Shiva :  ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యంగల పవిత్రదినం. ప్రతి నెలా బహుళ చతుర్దశి నాడొచ్చేది మాసశివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ ఈ మూడు శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధ‌భాగమిచ్చిన అర్ధ‌నారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఈశ్వరుడు.

మహేశ్వరుడిని, పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే, మహా శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ‘శివ’ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్ధం. శివుని పుట్టుక గురించి అనేక కధలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కైలాసనాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. యావత్‌ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే… మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం “శివలింగంగా” ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.

శివరాత్రి యొక్క మహాత్మ్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడనే బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకుని దాని మీద ఎక్కి కూర్చొని, ఆకలితో ఆ రోజంతా నిద్ర లేకుండా జాగారం చేస్తూ…. తన రాక కోసం ఎదురుచూసే భార్యాబిడ్డల్ని తలుచుకుని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో…? ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒక్కొక్కటిగా తుంచి కిందకి పడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్లి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి.

తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారితప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగారం చేయడమే కాకుండా, తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివసాయుజ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహాత్మ్యం గురించి తెలియకపోయినా యాదృచ్ఛికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణానంతరం పొందగలిగాడు.

శివ’ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. ‘శ’ అంటే శివుడనీ, ‘వ’ అంటే ‘శక్తి’ అనీ శివ పదమణిమాల చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటిజాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.

మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు..అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, శిరస్నానం  చేసి శివదర్శనం చేసుకొని, శివనామస్మరణతో ఉపవాసం వుండాలి.  ఆ రోజు రాత్రి సమయంలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి.

పూజా విధానం, మంత్రాలు తెలియక పోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది.

దేవుడికి అతి సమీపంలో వసించడమే ఉపవాసం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండటమే నిజమైన నియంత్రణం. అదే నిజమైన ఉపవాసం. భౌతికాభిరుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివ సంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో ఆవిష్కరించుకుని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం!

శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.

ఏటా అయిదు రకాలైన శివరాత్రులొస్తాయి. 1. నిత్య శివరాత్రి: ప్రతిరోజూ శివారాధాన చేస్తారు. 2. పక్ష శివరాత్రి: ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశులలో శివార్చన చేస్తారు. 3. మాస శివరాత్రి: ప్రతినెలా బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి: మాఘ బహుళ చతుర్దశినాటి సర్వశ్రేష్ఠమైన శివరాత్రి. 5. యోగశివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.

అరుణాచల శివ.. అరుణాచల శివ… అరుణాచల ….అరుణాచల శివ.. అరుణాచల శివ… అరుణాచల అరుణాచల శివ.. అరుణాచల శివ… అరుణాచల