లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సాహో బైడెన్ : కళ్ల ముందు ఇద్దరు కొడుకుల మరణాలు చూసి నిలబడ్డ విన్నర్

Published

on

Biden’s Life : కళ్లు ముందే ఇద్దరు కొడుకుల మరణాలు.. చావు వరకు వెళ్లొచ్చిన ప్రాణం ! అలాంటి విషాదాన్ని దాటుకొని వచ్చిన వ్యక్తి బైడెన్…. జీవితంలో ఎప్పుడూ ఏ క్షణంలోనూ ఆశను వదులుకోలేదు. అనుకున్న దాని కోసం కష్టపడ్డారు. 77ఏళ్ల వయసులో.. అదీ కరోనా విజృంభణ సమయంలో ఒక్క క్షణం కూడా వెనకడుగు వేయాలనే ఆలోచన లేకుండా కష్టపడి సాధించారు. వ్యక్తిగతంగానూ బైడెన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జీవితంలో విషాదం నింపిన ప్రమాదాలు కుంగదీసినా నిలబడి గెలిచారు.

1972లో తన తొలిభార్య నెలియా, ఏడాది పాప… క్రిస్మస్ షాపింగ్‌ నుంచి వస్తూ కారు ప్రమాదంలో చనిపోయారు. ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో కొడుకు పక్కన నిల్చొనే తొలిసారి సెనెటర్‌గా ప్రమాణం స్వీకారం చేశారాయన. కుమారుడు బ్యూ… తండ్రి బాటలో పయనించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. డెలావర్‌ రాష్ట్రానికి అటార్నీ జనరల్‌ అయ్యాడు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే దశలో… 2015లో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో చనిపోయాడు. ఇది బైడెన్‌కు రెండో షాక్‌.

జిల్ ను కలిసిన బైడెన్ :-
1975 లో బైడెన్‌ను జిల్‌ కలిశారు. రెండేళ్ళ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. బైడెన్‌కు మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లలకు జిల్‌ మంచి తల్లి అయింది. వీరిద్దరికి 1981లో కూతురు ఆష్లే పుట్టింది. తానిప్పుడు సోషల్ సర్వీసులో ఉంది. ప్రస్తుతం బైడెన్‌-జిల్‌లకు ఐదుగురు మనువలు, మనువరాళ్ళు. జిల్‌ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నానని చెప్తుంటారు బైడెన్. తన విజయంలో ఆమె పాత్ర ఎంతో ఉందని చాలాసార్లు చెప్పారు కూడా.

77 ఏళ్ల వయస్సులో :-
హెల్త్ విషయంలో బైడెన్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. 77ఏళ్ళ వయసులోనూ పరుగులాంటి వేగంతో నడవగలుగుతున్నారు. మద్యానికి ఆయన పూర్తిగా దూరం. 80 కిలోల బరువుతో.. వారానికి ఐదు రోజులు వ్యాయామం చేస్తారు. 1988లో ఓసారి బైడెన్‌కు తీవ్ర అనారోగ్యం చేసింది. మెదడుకు ఆపరేషన్ కూడా చేశారు. ఇక చనిపోతాడు అనుకొని చర్చి పాస్టర్‌ను కూడా పిలిపించారు. అనారోగ్యాన్ని జయించి ఆసుపత్రి నుంచి దర్జాగా వచ్చారు బైడెన్. ఆయన మరో కుమారుడు హంటర్‌… మందు, డ్రగ్స్‌కు బానిసై… డోప్‌ టెస్టులో దొరికాడు. 2014లో అమెరికా నేవీ రిజర్వ్‌ నుంచి బయటికొచ్చాడు. హంటర్ విషయంలో ఎన్నికల సమయంలో బైడెన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు ట్రంప్.

కుటుంబాన్ని, పిల్లలను నిర్లక్ష్యం చేయలేదు :-
ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా… కుటుంబాన్ని, పిల్లల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు బైడెన్. రాజకీయాల కారణంగా వాషింగ్టన్‌ డీసీలో ఉన్నా… పిల్లలతో గడిపేందుకు ప్రతిరోజూ రైలులో గంటన్నర ప్రయాణం చేసి రాత్రికల్లా డెలావర్‌లోని ఇంటికి చేరుకునేవారు. ఈ అలవాటును తాను సెనేటర్‌గా ఉన్న 36 సంవత్సరాల పాటు కొనసాగించారు. ప్రస్తుతం డెమొక్రటిక్‌ అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న బైడెన్‌… నిజానికి తన రాజకీయ అరంగేట్రం రిపబ్లికన్‌గానే చేశారు.

శ్వేత సౌధంలో :-
1968లో విలియం ప్రికెట్‌ అనే వ్యక్తి దగ్గర లాయర్‌గా పనిచేసిన సమయంలో.. స్థానిక రిపబ్లికన్‌లు బైడెన్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి నిక్సన్‌ అంటే ఇష్టం లేని బైడెన్‌… తర్వాత తన రిజిస్ట్రేషన్‌ మార్చుకున్నారు. డెమొక్రటిక్‌ పార్టీలో చేరారు. ఆరుసార్లు సెనేటర్‌గా, రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్.. ఎట్టకేలకు తన కలలసౌధమైన శ్వేతసౌధంలోకి ఈ ఏట అడుగు పెట్టారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయన.. అధ్యక్షుడిగానూ పలు సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.