ఇండియాకి బిగ్ రిలీఫ్, త్వరలోనే అందుబాటులోకి కరోనా‌ని ఖతం చేసే వ్యాక్సిన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

india corona vaccine: కరోనా కల్లోలం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందా? ఆదమరిస్తే అంతే సంగతులా? అంటే..కరోనా కేసుల సంఖ్య చూస్తే..అలానే అన్పిస్తోంది..అమెరికాలో ఒక్క రోజులోనే లక్షలకి లక్షలమంది వైరస్ బారిన పడుతుంటే.. మన దేశంలోనూ సెకండ్ వేవ్ పొంచి ఉందంటున్నారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఆస్ట్రాజెనెకా టీకా ఆశాకిరణంగా కన్పిస్తోంది.. అంతేకాదు రెండు డోసుల వ్యాక్సిన్ రేటు కూడా అందుబాటులో ఉంటుందంటున్నారు.. ఇంతకీ వ్యాక్సిన్ ఒక్కటే కరోనాని నియంత్రించగలదా…?

అత్యధిక కరోనా కేసుల్లో అమెరికా తర్వాత ఇండియానే:
కరోనా పోలేదు.. వైరస్ మనల్ని వెంటాడుతోంది…ఉధృతి తగ్గిందేమో కానీ.. ఒరవడిలో మాత్రం ఏ మార్పూ లేదు.. కాపాడే వ్యాక్సిన్ వచ్చేస్తుందా..? ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ బాహుబలి టీకా అవుతుందా..? కరోనా ప్రారంభమై ఏడాది పూర్తైన తర్వాత కూడా వైరస్ కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తుందే తప్ప.. భారీగా అంతరించిపోయిందనడానికి సంకేతాలు లేవ్.. ఎందుకంటే మన దేశంలో కరోనా కేసులు విషయంలో ఓ కోరుకోని రికార్డ్ క్రియేట్ చేసింది.. అమెరికా తర్వాత ప్రపంచంలోనే 90లక్షల కోవిడ్ 19 కేసులు నమోదైన దేశంగా ఇండియా చరిత్రకెక్కింది. ఐతే 80లక్షల కేసుల నుంచి 90లక్షల కేసులకు చేరడానికి 22 రోజుల సమయం పట్టడం మాత్రమే ఇక్కడ కాస్త మనకి ఊరటనిచ్చే అంశం.. కానీ చలి వాతావరణంలో వైరస్ భయంకరంగా విజృంభిస్తుందని ఇప్పటికే చాలా దేశాల్లో రుజువైంది.రెండు నెలల్లో అందుబాటులోకి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్:
మరి మన దేశం పరిస్థితేంటి..ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.. అంతకి మించి చాలామందిని వణికిస్తోన్న పరిణామం కూడా.. ఎందుకంటే గత పద్నాలుగు రోజుల్లో ఎప్పుడూ లేనంత స్థాయిలో ఒక్క గురువారమే 589మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా తయారు చేసిన వ్యాక్సిన్ రెండు నెలల్లోనే అది కూడా వెయ్యి రూపాయల్లోపే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈఓ ఆధార్ పూనావాలా చేసిన ప్రకటన పెద్ద రిలీఫ్ ఇస్తోంది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్ల కోసం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేస్తున్నట్లు.. రెండు నెలల్లోనే వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారాయన.

నవంబర్ నెలలో భారత్ లో తీవ్రంగా కరోనా కేసుల లోడ్:
సీరమ్ ఇన్ స్టిట్యూట్ సీఈఓ ప్రకటన మన దేశానికి పెద్ద ఊరటగా చెప్పాలి.. ఎందుకంటే.. నవంబర్ నెలలో విదేశాలతో పోల్చినప్పుడు కూడా మన దేశంలో కరోనా కేసుల లోడ్ ఎక్కువగా ఉంది.. అమెరికాలో నవంబర్‌ 19 నాటికే 24లక్షల 80వేల మంది కరోనా బారిన పడగా.. భారత్‌లో 8లక్షల 20వేలమందికి కరోనా సోకింది. ఫ్రాన్స్‌లో ఏడు లక్షల30 వేల మందికి, ఇటలీలో 6లక్షల 20వేల మందికి, యూకేలో 4లక్షల 40వేలమంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి సిచ్యుయేషన్‌లో టీకా తప్ప మరోటి వైరస్‌ని నియంత్రించ లేదు.

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైందా?
అలానే దేశంలో కరోనా కేసులు పెరుగుతాయా.. లేదా అనేది అప్పుడే చెప్పడం కష్టం అనే మరో వాదనా ఉంది. కరోనా నిర్ధారణ పరీక్షలు పది లక్షల పైచిలుకు చేసినప్పుడు 45వేల పాజిటివ్ కేసులకు అటూ ఇటుగా వస్తుండగా.. టెస్టుల సంఖ్య తగ్గినప్పుడు ఆటోమేటిగ్గా పాజిటివిటీ రేటు కూడా తగ్గి కన్పిస్తుంది.. పండగల సీజన్ కావడంతో గత వారం రోజులుగా నిర్ధారణ పరీక్షలు తక్కువ స్థాయిలో జరిగాయంటున్నారు. దేశంలో సెకండ్ వేవ్ మొదలైందా లేదా అనేది టెస్టులనే బట్టే తేలుతుంది.

ఢిల్లీలో ప్రతి రోజూ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు:
ఇప్పటికే ఢిల్లీ నగరంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. ఢిల్లీలో ప్రతి రోజూ రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయ్. ఇక్కడ సాక్షాత్తూ మంత్రులే థర్డ్ వేవ్ మొదలైందని ప్రకటిస్తున్నారు.. గురువారం(నవంబర్ 19,2020) ఒక్కరోజే 7వేల 546మందికి కరోనా సోకడం, కోవిడ్ కేసులు దేశ రాజధానిలో బయటపడటం ప్రారంభమైన తర్వాత ఇదే అత్యధిక సంఖ్యగా చెబుతున్నారు. అందుకే ఢిల్లీలో మాస్క్ లేకుండా బయట కన్పిస్తే 2 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

మహారాష్ట్రలోనూ ప్రమాద ఘంటికలు:
మరోవైపు మొత్తం దేశంలోనే హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలోనూ ఇదే తరహా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయ్. రోజుకు 5వేల సంఖ్యకి తగ్గకుండా జనం వైరస్ బారిన పడుతున్నారు. గురువారం ఒక్కరోజే ఇక్కడ 5వేల 535మంది కోవిడ్ పాజిటివ్‌గా తేలారు. దీంతో మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 17లక్షల 70వేలకు చేరువైంది. అలానే గుజరాత్‌లోనూ రోజుకు 1000 కేసులకి పైగా నమోదు అవుతున్నాయ్.

టీకా ధర రెండు డోసులకు వెయ్యి రూపాయలు:
మరి ఈ దశలో వచ్చే ఆరు నెలల్లోనే కరోనాకి వ్యాక్సిన్ వచ్చేస్తుందంటున్నారు సీరమ్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ ఫూనావాలా. 2020 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వారియర్లకు అందించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నారాయన.. దీంతో ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు నిర్మూలన దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయనుకోవాలి… ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజల కోసం కూడా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా టీకా రెడీ అవనుంది. ఐతే దేశంలో చిట్టచివరి వ్యక్తి వరకూ కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి మాత్రం 2024 వరకూ సమయం పట్టొచ్చని పూనావాలా మాటలను బట్టి తెలుస్తోంది.. ఈ టీకా ధర రెండు డోసులకు కలిపి వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

ఇండియాలో రానున్న 2నెలల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సినేషన్ జరగడం ఖాయం:
తొలిదశలో హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లు, వృద్ధులకు వ్యాక్సిన్‌ అందనుంది.. ప్రస్తుతం వారికి అవసరమయ్యే సంఖ్యలో డోసులను ఉత్పత్తి చేయడం, సరఫరా కోసం రెండు నెలల సమయం పడుతుంది. అంటే మన దేశంలో రానున్న రెండు నెలల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సినేషన్ జరగడం ఖాయంగా కన్పిస్తోంది. భారత్‌లో తిరిగి వ్యాధి విజృంభిస్తుందేమో అనే టెన్షన్ ప్రారంభమైన నేపథ్యంలో కనీసం ఓ వ్యాక్సిన్ అయినా అందుబాటులోకి రానుండటం రిలీఫ్‌నిచ్చే అంశంగా చూడాలి.

Related Tags :

Related Posts :