అమెరికా అధ్యక్ష ఎన్నికలు : 72శాతం మంది భారతీయ-అమెరికన్ల ఓటు జో బైడెన్ కే…సర్వే

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2020 / 09:31 PM IST
అమెరికా అధ్యక్ష ఎన్నికలు :  72శాతం మంది భారతీయ-అమెరికన్ల ఓటు జో బైడెన్ కే…సర్వే

Indian Americans Plan To Vote For Joe Biden వచ్చే నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 72శాతం మంది భారతీయ-అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఓ సర్వేలో తేలింది. 2020 ఇండియన్-అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే(IAAS)ప్రకారం…కేవలం 22శాతం మంది భారతీయ-అమెరికన్లు మాత్రమే రిపబ్లిక్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయాలని అనుకుంటున్నారట. 72శాతం మంది భారతీయ-అమెరికన్లు జో బైడెన్ కే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారట. సెప్టెంబర్ నెలలో 20రోజుల పాటు ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 936మంది భారతీయ-అమెరికన్లు ఈ మేరకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.



తమ ఓటింగ్ నిర్ణయంలో భారత్-అమెరికా సంబంధాలును పెద్ద కారణంగా తాము పరిగణించట్లేదని వారు తెలిపారు. అయితే,ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్-అమెరికా సంబంధాలను నిర్వహించడంలో డెమెక్రాట్స్…బెటర్ జాబ్ చేస్తారని ఎక్కువమంది భారతీయ-అమెరికన్లు నమ్ముతున్నట్లు సర్వే తెలిపింది. ఇదేసమయంలో,డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్…డెమొక్రాట్లకు అనుకూలంగా భారత అమెరికన్ సమాజాన్ని తమవైపు తిప్పుకోగలరని నివేదిక తెలిపింది.



మరోవైపు, జో బైడెన్ ను వదిలేసి.. కమలా హారిస్​ నే లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఉపాధ్యక్ష అభ్యర్థుల డిబేట్​ తర్వాత.. కమల చాలా భయంకరంగా ఉన్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. జో బైడెన్​ ఎన్నికల్లో గెలిస్తే నెలల్లోనే ‘కమ్యూనిస్ట్ కమల’ అధికారం చేపడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కమలా హారిస్ ​పై ట్రంప్ విమర్శలు చేయటానికి ప్రధాన కారణం.. బైడెన్​ను ఇరకాటంలో పెట్టడమే. కరోనా నుంచి కోలుకుని ప్రచారం మొదలు పెట్టిన అనంతరం ట్రంప్​ తన అజెండాను పూర్తిగా మార్చేశారు. కమలపైనే పూర్తిస్థాయి దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే డెమొక్రాట్లకు ఓటేస్తే.. స్పీకర్​ నాన్సీ పెలోసీ బైడెన్​ను గద్దె దింపి కమలను అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని ప్రజలను హెచ్చరిస్తున్నారు.


కమలపై వ్యక్తిగత దూషణకూ ట్రంప్ వెనకాడటం లేదు. లింగ వివక్ష, జ్యాత్యాంహకారపూరిత విద్వేష వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు. కమల మాత్రం రిపబ్లికన్ల విమర్శలపై ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. కరోనా సోకకముందు వరకు ట్రంప్… బైడెన్ లక్ష్యంగానే విమర్శలు చేశారు. అయితే… ఇప్పటికే ముందస్తు పోలింగ్​ జరుగుతున్న చాలా రాష్ట్రాల్లో.. బైడెన్​ వర్గం దూసుకుపోతున్నట్లుగా నివేదికలు వస్తున్నాయి. తమ వ్యూహం ఫలించలేదని భావించిన రిపబ్లికన్ ప్రచార బృందం… కమలపైకి దృష్టి మరల్చింది. బైడెన్​ను నోట్లో నాలుక లేని వ్యక్తిగా చిత్రీకరిస్తూ.. కమలను ‘దూకుడు’ మనిషిగా విమర్శిస్తున్నారు రిపబ్లికన్ పార్టీ నాయకులు.