అస్పిరిన్.. కరోనాతో మరణ ముప్పును ఎదుర్కోగలదా?

  • Published By: sreehari ,Published On : November 12, 2020 / 03:14 PM IST
అస్పిరిన్.. కరోనాతో మరణ ముప్పును ఎదుర్కోగలదా?

Aspirin COVID-19 patients : కరోనాతో ఆస్పత్రిలో చేరిన వారిలో మరణ ముప్పును ఆస్పిరిన్ తగ్గించగలదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో గుర్తించారు.



గుండె సంబంధిత సమస్యలు ఉన్న కరోనా బాధితులు ప్రతిరోజు ఆస్పిరిన్ తక్కువ మోతాదును తీసుకున్నారు. ఆస్పిరిన్ తీసుకోని వారితో పోలిస్తే.. ప్రతిరోజు ఆస్పిరిన్ తీసుకునే వారిలో కరోనా మరణ ముప్పు తక్కువగా ఉందని పరిశోధక బృందం తేల్చేసింది.

సగటున 55ఏళ్ల వయస్సు ఉండి ఆస్పిరిన్ తీసుకున్న 412 మంది కరోనా బాధితుల మెడికల్ రికార్డులను రీసెర్చర్లు అధ్యయనం చేశారు.



కరోనాతో కొన్ని నెలలుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారే ఉన్నారు. ఇందులో మూడో వంతు మంది ప్రతిరోజు తక్కువ మోతాదుతో (అస్పిరిన్) 81 మిల్లీగ్రాములు తీసుకుంటున్నారు.

వీరంతా కరోనాతో ఆస్పత్రుల్లో చేరకముందు నుంచే గుండె సంబంధిత సమస్యలకు ఈ అస్పిరిన్ మెడిసిన్ తీసుకుంటున్నారని పరిశోధకులు నిర్ధారించారు.



ఆస్పిరిన్ తీసుకున్న కరోనా బాధితుల్లో 44 శాతం వరకు మెకానికల్ వెంటిలేటర్ వరకు వెళ్లే ముప్పు ఉండదని, 43 శాతం మందిలో ఐసీయూ చేరాల్సిన ముప్పు ఉండదని, మొత్తంగా 47 శాతం వరకు కరోనాతో ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం ఉండదని పరిశోధకులు తేల్చేశారు.



ఆస్పత్రుల్లో చేరిన కరోనా బాధితుల్లో ప్రత్యేకించి రక్తస్రావం వంటి సమస్యలు ఎదుర్కోలేదని గుర్తించారు. మొత్తంగా పరిశీలిస్తే.. అస్పిరిన్ తీసుకున్న వారిలో కరోనా ముప్పు తగ్గిందని క్లినికల్ ట్రయల్స్ ద్వారా కూడా నిరూపితమైందని తెలిపారు.



అస్పిరిన్ మెడిసిన్ అనేది యాంటీ ప్లేట్ లెట్ ఏజెంట్.. దీనిద్వారా రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు సాయపడుతుంది. కరోనా సోకిన వారిలో చాలామందిలో రక్త కణాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితికి కారణమవుతోంది. అదే అస్పిరిన్ తీసుకుంటే.. కరోనా బాధితుల్లో రక్తం గడ్డకట్ట కుండా నివారించగలదని అధ్యయనాల్లో వెల్లడైంది.