విజృంభిస్తోన్న కరోనా.. అసలే చలికాలం జాగ్రత్త..

  • Published By: sreehari ,Published On : November 15, 2020 / 09:12 PM IST
విజృంభిస్తోన్న కరోనా.. అసలే చలికాలం జాగ్రత్త..

Covid-19 Cases increasing in North India : ఉత్తర భారతాన్ని కోవిడ్ వణికిస్తోంది. చలికాలంలో.. కేసులు బాగా పెరిగి పోతున్నాయి. కేవలం కరోనా కేసులు మాత్రమే కాదు.. మరణాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి.



గత పది రోజుల్లో ఢిల్లీతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ కరోనా మరణాలు పెరిగాయి. దేశరాజధానిలో ఐతే.. పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది.

చలికాలంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఉత్తర భారతంలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. ఇటీవలి కాలంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి.



దేశరాజధానిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత పది రోజుల్లో.. ఢిల్లీలో 728 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. అంతకుముందు 10 రోజులతో పోలిస్తే.. ఢిల్లీలో కోవిడ్ మరణాలు 75 శాతం పెరిగాయి.

హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లోనూ కోవిడ్ మరణాల సంఖ్య స్వల్పంగా పెరిగింది. పంజాబ్, ఉత్తరాఖండ్‌లోనూ.. గత పదిరోజులుగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి.



మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత.. ఈ పది రోజుల్లో బెంగాల్‌లో 549, చత్తీస్‌ఘడ్‌లో 309 కోవిడ్ మరణాలు సంభవించాయి. మునుపటితో పోలిస్తే.. ఈ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ మృతుల సంఖ్య కాస్త తగ్గింది.

ఓవరాల్‌గా ఇప్పటివరకు భారతదేశంలో 87 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి లక్షా 29 వేల మంది చనిపోయారు.



ప్రస్తుతం దేశంలో 4 లక్షల 80 వేల యాక్టివ్ కేసులున్నాయి. దాదాపు 82 లక్షల మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 93 శాతానికి పెరిగింది.