క‌రోనా ఆఖరి మ‌హ‌మ్మారి కాదు…తర్వాతి దానికి సిద్ధంగా ఉండండి : WHO చీఫ్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2020 / 05:32 PM IST
క‌రోనా ఆఖరి మ‌హ‌మ్మారి కాదు…తర్వాతి దానికి సిద్ధంగా ఉండండి : WHO చీఫ్ కీలక వ్యాఖ్యలు

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. వైర‌స్ క‌ట్ట‌డి కోసం అన్ని దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్ల‌డంతో ఆర్థిక సంక్షోభాల‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక చేసింది.

కరోనా… చివరి మహమ్మారి కాదని, తరువాత మరిన్ని మహమ్మారులు దాడి చేసే అవకాశం ఉందని , తరువాతి మహమ్మారి కోసం ప్రపంచం ప్రస్తుతానికంటే మరింత సంసిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ హెచ్చరించారు.


మహమ్మారి అనేది జీవిత సత్యం అని చరిత్ర మనకు బోధిస్తుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ పేర్కొన్నారు .అయితే తదుపరి మహమ్మారిని మెరుగైన రీతిలో ఎదుర్కోవటానికి ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని,   ప్రపంచ దేశాలు ప్రజారోగ్యంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

అదేవిధంగా కేవలం ఏ ఒక్క దేశమో వ్యాక్సిన్‌ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని WHO అభిప్రాయపడింది. దేశాలన్నీ అనుసంధానమై ఉన్న ప్రపంచంలో, స్వల్ప ఆదాయ దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ అందకపోతే అది మరింత విస్తరించే ప్రమాదం ఉంటుందని WHO హెచ్చ‌రించింది. అందుకే ప్రతి దేశానికి వ్యాక్సిన్‌ అందించడం ఎంతో కీలకమని తెలిపింది.


కాగా, కరోనా వ్యాక్సిన్‌ అన్ని దేశాలకు సమానంగా అందేలా ‘కొవ్యాక్స్‌’ కార్యక్రమాన్ని WHO చేపట్టింది. తద్వారా టీకా తయారుచేసుకోలేని, కొనలేని దాదాపు 100 దిగువ, మధ్యతరగతి దేశాలకు వ్యాక్సిన్‌ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్న‌ది. ఈ కార్యక్రమంలో భారత్‌ను భాగస్వామిగా చేర్చుకునేందుకు WHO ఇప్పటికే చర్చలు జరుపుతున్న‌ది.


అయితే, కరోనా… చివరి మహమ్మారి కాదు. ఇలాంటి మహమ్మారుల వ్యాప్తి తరువాత కాలంలో కూడా కొనసాగుతుందని టెడ్రోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి