ఈ బ్లడ్ గ్రూపువారిపైనే కరోనా తీవ్ర ప్రభావం ఎక్కువంట.. తస్మాత్ జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : October 15, 2020 / 05:45 PM IST
ఈ బ్లడ్ గ్రూపువారిపైనే కరోనా తీవ్ర ప్రభావం ఎక్కువంట.. తస్మాత్ జాగ్రత్త!

Blood groups : కరోనా వైరస్ బ్లడ్ గ్రూపులను బట్టి ప్రభావం చూపుతుందని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. కరోనా వైరస్‌ మహమ్మారికి సంబంధించి బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ రీసెర్చర్లు కొత్త అధ్యయనం చేశారు.



బ్లడ్‌ గ్రూప్‌ O (+ లేదా -) కలిగిన ప్రజలపై కరోనా వైరస్‌ అంతగా ప్రభావం చూపించడం లేదని గుర్తించారు. కరోనా వైరస్‌ కారణంగా శరీర అవయవాలు దెబ్బతినడం లేదా మృతిచెందడం వంటివి చాలా తక్కువని నమోదయ్యాయని ఓడెన్స్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.





కరోనా బారిన పడుతున్న వారిలో ‘O’ బ్లడ్‌ గ్రూప్‌ ప్రజలు తక్కువగా ఉన్నారని పరిశోధకులు గుర్తించారు. A, B, AB గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని వెల్లడించారు. ఈ బ్లడ్ గ్రూపుల వారిపైనే కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని పేర్కొన్నారు.

వీరిపైనే వైరస్‌ ప్రమాదకర స్థాయిలోకి మారుతోందని డానిష్‌ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 22 లక్షల మంది కరోనా బాధితుల నుంచి 4,73,000 మంది కరోనా కేసులపై అధ్యయనం నిర్వహించారు. ప్రత్యేకించి O, B బడ్‌ గ్రూపుల వారికన్నా A, AB బడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని నిర్ధారించారు.



A, AB గ్రూప్‌లపైనే వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ జరిపిన రెండో అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. కరోనా కేసుల్లో 38 శాతం మంది ‘O’ బ్లడ్‌ గ్రూప్‌ వారు ఉండగా.. 62 శాతం మంది A, B లేదా AB బ్లడ్‌ గ్రూప్‌లవారు ఉన్నారని పరిశోధకులు పేర్కొన్నారు.

A బ్లడ్‌ గ్రూప్‌ వారికే ఎక్కువగా ఆక్సిజన్‌ వెంటిలేటర్‌ అవసరం పడుతోందని వెల్లడించారు. వెంటిలేటర్ ఆక్సిజన్ సపోర్టు అవసరమైన కరోనా కేసుల్లో 95 శాతం మంది AB బ్లడ్‌ గ్రూప్‌లవారే ఉన్నారని పరిశోధకులు తెలిపారు.