దర్శకుడు రాంగోపాల్ వర్మకు రూ.88వేల జరిమానా

  • Published By: naveen ,Published On : July 30, 2020 / 09:44 AM IST
దర్శకుడు రాంగోపాల్ వర్మకు రూ.88వేల జరిమానా

వివాదాస్పద, సంచలన సినిమాల దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) వరుసగా రెండోసారి జరిమానా విధించింది. వర్మ తాజా చిత్రం ‘పవర్‌స్టార్‌’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకు జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ ఎన్‌ఫోర్స్‌మెంటల్‌ సెల్‌ రూ.88వేలు చెల్లించాలని బుధవారం ఈ-చలానా జారీ చేసింది.

లాక్‌డౌన్‌ తర్వాత మొదటి పోస్టర్‌ అంటూ ట్విట్టర్‌లో ఆర్జీవీ ఇటీవల పెట్టిన పోస్టును ఓ నెటిజన్‌ సీఈసీ-ఈవీడీఎం ఖాతాకు జోడిస్తూ ఫిర్యాదు చేశారు. ఆ ట్వీట్‌కు స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జూలై 22న జూబ్లీహిల్స్‌లో అంటించిన రెండు పోస్టర్లకు గానూ రూ.4 వేలు జరిమానా విధించారు. అయితే ఇదే ప్రాంతంలో దాదాపు 30కి పైగా పోస్టర్లు అంటించినట్లు అధికారులు గుర్తించారు. వీటికి అనుమతులు తీసుకోలేదని తేలడంతో రూ.88వేల జరిమానా విధించారు.

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్’ సినిమాతో గతకొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హంగామా చేశాడు. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వారు కూడా పరాన్నజీవి పేరుతో వర్మను ఉద్దేశించి సినిమా తీశారు. ఇలా వర్మ, పవన్ ఫ్యాన్స్ మధ్య యుద్ధమే నడిచింది.

తాను తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాని జూలై 25న ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో వర్మ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్‌పైనే ఆ సినిమా అంటూ వ‌ర్మ చేసిన హ‌డావిడి అంతా ఇంతా కాదు. కేవ‌లం 37 నిమిషాల నిడివితో ప‌వ‌ర్ స్టార్ సినిమా తీశాడు. ఈ సినిమాపై పెద్ద ర‌చ్చే జరిగింది. వ‌ర్మ‌కు వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోలింగ్ కూడా జ‌రిగింది. ఆర్జీవీ ఆఫీసుపై దాడి జరగడం కలకలం రేపింది. ఆ సినిమాతో వర్మ ఏం సాధించాడో తెలియదు కానీ, ఊహించని విధంగా జీహెచ్ఎంసీ వర్మకు వరుసగా షాక్ లు ఇస్తోంది. పెద్ద పెద్ద నీతులు చెప్పే వర్మ, మరిప్పుడు రూల్స్ బ్రేక్ చేసిన తప్పుని ఒప్పుకుని, ఫైన్ చెల్లిస్తాడో లేదో చూడాలి.